అబూజ్‌మాడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ | 7 Naxals death in Chhattisgarh Encounter | Sakshi
Sakshi News home page

అబూజ్‌మాడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Feb 7 2026 5:57 AM | Updated on Feb 7 2026 5:57 AM

7 Naxals death in Chhattisgarh Encounter

ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల హతం

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ వాసి ప్రభాకర్‌

సీ–60 జవాన్‌ దీపక్‌ చిన్న మడావి మృతి

మూడు ఏకే–47 తుపాకుల స్వాధీనం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/కాళేశ్వరం: మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అబూజ్‌మాడ్‌ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ సంభవించింది. పోలీసులు–మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలి డివిజన్‌ కమిటీ ఇన్‌చార్జి, వెస్ట్‌ సబ్‌జోనల్‌ బ్యూరో ఇన్‌చార్జి, సీపీఐ (మావోయిస్ట్‌) కంపెనీ నంబర్‌ 10 ఇన్‌చార్జి ప్రభాకర్‌ (తెలంగాణ, కామారెడ్డి జిల్లా వాసి) కూడా ఉన్నారు. ప్రభాకర్‌పై తెలంగాణ, మహారాష్ట్రల్లో రూ.50 లక్షల రివార్డు ఉంది. గత మూడు రోజులుగా కొనసాగిన ఆపరేషన్‌లో గురువారం రాత్రి వరకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, శుక్రవారం ఆపరేషన్లలో మరో నలుగురు (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మిగిలిన మావోయిస్టుల గుర్తింపు.. నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనాస్థలం నుంచి మూడు ఏకే–47 రైఫిళ్లు, 1 ఎస్‌ఎల్‌ఆర్, ఒక 303 పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో సీ–60 జవాన్‌ దీపక్‌ చిన్న మాడవి (38) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అహేరి తాలూకా మంద్రా గ్రామానికి చెందిన ఆయన గురువారం ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు. అదే సమయంలో గుండెపోటు రావడంతో హెలికాప్టర్‌లో బామ్రాగడ్‌ సబ్‌డిస్ట్రిక్ట్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతిచెందారు. మరో సీ–60 జవాన్‌ జోగా మాడవ్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఆయనను హెలికాప్టర్‌లో గడ్చిరోలికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను గడ్చిరోలి పోలీసులు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.

1995లో అజ్ఞాతంలోకి..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సీనియర్‌ మావోయిస్టు ప్రభాకర్‌ అలియాస్‌ పడ్కల్‌ స్వామి అలియాస్‌ లోకేటి చందర్‌ రావు (60)ది కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. 1995లో అడవిబాట పట్టిన ఆయన తిరిగి ఇంటిముఖం చూడలేదు. అప్పట్లో తండ్రి చనిపోయినా, మూడేళ్ల కిందట తల్లి చనిపోయినా ఇంటికి రాలేదు. సిర్నాపల్లి దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగానూ పనిచేశారు. పోలీసు నిర్బంధం పెరిగిన సమయంలో ఆయన్ను దండకారణ్యానికి పంపించారు.

అక్కడ పీపుల్స్‌ గెరిల్లా లిబరేషన్‌ ఆర్మీకి ప్రభాకర్‌ నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నాయకత్వంలో ఆయన పనిచేసినట్టు ఈ మధ్య లొంగిపోయిన ఓ మావోయిస్టు నేత చెప్పారు. ప్రభాకర్‌ వెళ్లిన కొంత కాలానికి ఆయన భార్య నవత అలియాస్‌ లోకేటి సులోచన కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది. ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో దండకారణ్యంలో చనిపోయింది. ఆయన కొడుకు రమేశ్‌ అలియాస్‌ అశోక్, కూతురు లావణ్య కూడా తల్లిదండ్రుల బాటలో నడిచారు. రెండు నెలల కిందట రమేశ్‌ లొంగిపోగా, లావణ్య ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టయి జైల్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement