‘సమ్మక్క’కు ఎన్ఓసీలో కదలిక | Chhattisgarh agrees to a survey on the flooding | Sakshi
Sakshi News home page

‘సమ్మక్క’కు ఎన్ఓసీలో కదలిక

Feb 5 2026 4:22 AM | Updated on Feb 5 2026 4:22 AM

Chhattisgarh agrees to a survey on the flooding

ముంపుపై సర్వేకు ఛత్తీస్‌గఢ్‌ సమ్మతి

రూ.9.88 కోట్ల ఖర్చు చెల్లించాలని లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: సమ్మక్క సాగర్‌ బరాజ్‌లో గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) మేర నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్‌గఢ్‌ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై సర్వే నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సర్వే నిర్వహణకు రూ.9.88 కోట్ల వ్యయం కానుందని, ఈ మేరకు నిధులను తమ రాష్ట్రానికి జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గత నెల 24న లేఖ రాసింది. సర్వే నివేదిక అందిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

సమ్మక్కసాగర్‌ నిర్మాణంతో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ముంపునకు గురికానున్న భూములు, గ్రామాలు, ఇతర ఆస్తుల విషయంలో పూర్తి పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత సెపె్టంబర్‌ 22న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయితో సమావేశమై ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ జారీ చేయాలని విజ్ఞప్తి చేయగా, అక్కడి సీఎం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. 

సమ్మక్క బరాజ్‌తో ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురికానున్న భూముల సేకరణ, పరిహార చెల్లింపు, పునరావాస కల్పన విషయంలో తెలంగాణ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని అప్పట్లో హామీ ఇచ్చారు. బీజాపూర్‌ జిల్లా భూపాలపట్నం తహసీల్‌ పరిధిలో 13.06 హెక్టార్ల భూములు, 53.03 హెక్టార్ల నది, 6.35 హెక్టార్ల నాలా భూమి ముంపునకు గురికానుందని ప్రాథమికంగా తేల్చారు. 

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ జారీ చేస్తే ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులకు ప్రధాన అడ్డంకి తొలగిపోనుంది. ములుగు జిల్లాలో తుపాకులగూడెం వద్ద గోదావరిపై 6.7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 83 మీటర్ల ఎత్తులో సమ్మక్కసాగర్‌ను నిర్మిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ రెండో దశ కింద ఉన్న 1.78 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణతోపాటు రామప్ప–పాకాల లింక్‌ కాల్వ కింద 12,146 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 

ఈ ప్రాజెక్టుతో వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వ్యవసాయం దశ మారుతుందని, నమ్మకమైన సాగునీటి సరఫరాతో కరువు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రాజెక్టులో భాగంగా బరాజ్‌తోపాటు అప్రోచ్‌ కాల్వలు, గ్రావిటీ కాల్వలు, 3 పంప్‌హౌస్‌లు, డెలివరీ సిస్టర్న్స్, 90 కి.మీల సొరంగాల నెట్‌వర్క్‌ నిర్మిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement