కిలోమీటర్ వరకు నిర్దిష్ట సర్వీస్ లైన్‌చార్జీలు
ఇప్పటివరకు సర్వీస్ లైన్ నిర్మాణ వ్యయం వసూలు
ఇక నుంచి వినియోగదారులకు తప్పనున్న ఆ భారం
ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఈఆర్‌సీ
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు
హన్మకొండ: విద్యుద్దీకరణ చేపట్టనున్న ప్రాంతాల్లో ఎల్‌టీ సర్వీసుల మంజూరు సులభతరం చేశారు. పైగా ఖర్చుల భారం కూడా తగ్గించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి జనవరి 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలు కావాల్సి ఉండగా, అవగాహన లేకపోవడం, సమాచార లోపం తదితర కారణాలతో ఆలస్యమైంది.
ఈ నేపథ్యంలో గురువారం నుంచి కచ్చితంగా అమలు చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. సర్వీస్ మంజూరుకు అవసరమైన విద్యుత్ లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ఇప్పటి వరకు వినియోగదారుడు భరించాల్సి వచ్చేది. ఇప్పటి నుంచి కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి విద్యుత్ లైన్ నిర్మాణ ఖర్చులు చెల్లించాల్సి ఉండదు. దీంతో విద్యుత్ వినియోగదారుడికి రూ.లక్షకు పైగా సొమ్ము ఆదా కానుంది.
రైతులకు ఊరట
కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరులో రైతులకు ఊరట లభించింది. ఇప్పటి వరకు 3 స్తంభాల దూరం వరకు నిర్ణీత చార్జీలతో విద్యుత్ సర్వీస్ మంజూరు చేసేవారు. మూడు స్తంభాల దూరం దాటితే ఓఆర్‌సీ కింద రైతులు రూ.45 వేలకు పైగా చెల్లించేవారు. ప్రస్తుతం నూతన నిబంధనలతో కిలోమీటర్ దూరం వరకు విద్యుత్ లైన్ నిర్మాణానికి ఎలాంటి ఖర్చులూ ఉండవు.
పరిశ్రమలకు కూడా కిలోమీటర్ వరకు ఎలాంటి నిర్మాణ ఖర్చులు ఉండవు. గతంలో అధికారులు, సిబ్బంది ఎస్టిమేషన్ సాకుతో వినియోగదారులను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలున్నాయి. కిలోమీటరు దూరం దాటితే ఎస్టిమేట్ మేరకు ఖర్చులు వినియోగదారుడు భరించాలి.
ఏకరీతి విధానం తీసుకొచ్చిన టీజీ ఈఆర్‌సీ
విద్యుత్ లైన్ నిర్మాణం అవసరం లేకున్నా... కిలోమీటర్ దూరం విద్యుత్ లైన్ వేయాల్సి ఉన్నా ఒకే నిబంధన, చార్జీలు వర్తించేలా ఏకరీతి విధానాన్ని టీజీ ఈఆర్‌సీ తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. లోడ్ ఆధారిత చార్జీలు చెల్లిస్తే విద్యుత్ సర్వీస్ మంజూరు చేస్తారు. అవసరమైతే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చులు కూడా డిస్కం భరిస్తుంది. వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అమర్చితే ఈ ఖర్చులను వినియోగదారుల నుంచి డిస్కం వసూళ్లు చేస్తుంది. ఈ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఇతరులకు విద్యుత్ సరఫరా చేయడానికి వీలులేదు.
టీజీ ఈఆర్‌సీ రెగ్యులేషన్స్ ప్రకారం చార్జీల వివరాలు ఇలా..
» ఎల్‌టీ–1, గృహాలకు విద్యుత్ సర్వీస్ మంజూరు
» కిలోవాట్‌కు రూ.500 సర్వీస్ కనెక్షన్ చార్జీలతోపాటు అదనంగా డెవలప్‌మెంట్ చార్జి, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
» కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.500తోపాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.600 చొప్పున, వీటికి అదనంగా డెవలప్‌మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
» 5 కిలోవాట్ పైనుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.2,900తోపాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.1,500 చొప్పున వీటికి అదనంగా డెవలప్‌మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
» 20 కిలోవాట్లకు పైన.. ప్రతీ కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.
ఎల్‌టీ–2: గృహేతర, వాణిజ్యం
» కిలోవాట్ వరకు.. కనీస చార్జీ రూ.వెయ్యికి అదనంగా డెవలప్‌మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
» కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.వెయ్యితోపాట ప్రతీ కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున చెల్లించాలి. అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్‌మెంట్ చార్జీ ఉంటుంది.
» 5 కిలోవాట్ పైనుంచి నుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.5,800తో పాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.2 వేల చొప్పున చెల్లించాలి. అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్‌మెంట్ చార్జీ ఉంటుంది.
ఎల్‌టీ–3: పరిశ్రమలు
» 20 కిలోవాట్లపై ప్రతీ కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.
» 20 కిలోవాట్ల వరకు ప్రతీ కిలోవాట్‌కు రూ.4 వేల చొప్పున అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్‌మెంట్ చార్జీ చెల్లించాలి.
» 20 కిలోవాట్లపై ప్రతీ కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్‌మెంట్ చార్జీ చెల్లించాలి.
ఎల్‌టీ–4: కుటీర పరిశ్రమలు
» నిర్ణీత లోడ్ వరకు కిలోవాట్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి.
ఎల్‌టీ–5: వ్యవసాయం
» కిలోవాట్‌కు రూ.వెయ్యి చెల్లించాలి. దీనికి అదనంగా డెవలప్‌మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.


