‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి
మిర్యాలగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
ప్రభుత్వ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి
పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా అధికార పార్టీకి ఓటేయాలి
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల డిపాజిట్లు గల్లంతు కావాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందాలంటే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మున్సిపాలిటీల్లో రూ.17,472 కోట్లు ఖర్చు పెట్టామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం కనీసం రేషన్‌కార్డులు ఇవ్వలేదు..
‘మున్సిపల్ శాఖ నా వద్దే ఉంది. మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత. వడ్డించే వాడు మనవాడు. అడిగే వాడు కూడా మనోడై ఉండాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు వెళ్లే వారినే గెలిపించాలి. ఇంకా 8 ఏళ్లు అధికారంలో ఉంటాం. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. గత ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. దేశ«ంలో ఎక్కడాలేని విధంగా 3.17 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరేసుకోవాలని, ధాన్యం తీసుకోమని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చాక సన్న వడ్లు పండించాలని చెప్పాం. రూ.500 బోనస్ కూడా ఇస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌తో పాటు 54 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం’ అని సీఎం చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా
‘రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లతో రుణమాఫీ చేసి అప్పుల నుంచి విముక్తి కల్పించాం. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నాం. గతంలో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ఇచ్చాం. ఈ మున్సిపల్ ఎన్నికలు ముగియగానే మరో రూ.9 వేల కోట్లు ఇస్తాం. రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 1000 బస్సులను మహిళలకు ఇచ్చి యజమానులను చేశాం. రూ.25 వేల కోట్లను మహిళా సంఘాలకు ఇచ్చాం. పెట్రోల్ బంకులు పెట్టించాం. ప్రజా ప్రభుత్వం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి. పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళలంతా కాంగ్రెస్‌కే ఓటేయాలి. బీజేపీ, బీఆర్‌ఎస్ వాళ్ల డిపాజిట్లు గల్లంతు కావాలి..’ అని సీఎం అన్నారు.
మరిన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారు. కేసీఆర్ మాత్రం డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేదలను ఊరించి తాను మాత్రం వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. పంజాగుట్టలో రూ.2 వేల కోట్లతో గడీని కట్టుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వచ్చే బడ్జెట్‌లో మరిన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. మరింత మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచుతాం..’ అని రేవంత్ చెప్పారు.
మొగుడూ పెళ్లాల ఫోన్లు విన్నారు
‘పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ తన దుర్మార్గ పాలనతో తెలంగాణను దోచుకున్నారు. అయినా పోనీలే అనుకుంటే.. పెళ్లాం, మొగుడు మాట్లాడుకుంటుంటే ఫోన్లు విన్నారు. జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు.. అందరి ఫోన్లు విన్నారు. అలాంటి వ్యక్తికి పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని అంటున్నారు. భార్యభర్తల మాటలు విన్న నువ్వు జాతిపితవు ఎలా అవుతావు? కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చేనట్లే అంటున్నారు. అలాగైతే జన్వాడ, ఎర్రవల్లి, మొయినాబాద్ ఫాంహౌస్‌లను, టీవీలు, పేపర్లను, దోచుకున్న వేలాది కోట్లను తెలంగాణ సమాజానికి ఇస్తారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి..అన్ని పదవులూ వారే తీసుకున్నారు.
తెలంగాణ కోసం మొదటగా ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు చిన్న పదవి కూడా ఇవ్వలేదు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు. ఏపీలో పార్టీ చనిపోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పరవాలేదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అవుతుంది. నీలాంటి వాళ్లు ఎలా జాతిపిత అవుతారు?..’ అంటూ సీఎం తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతి, వేముల వీరేశం, జైవీర్‌రెడ్డి, బాలునాయక్, మందుల సామేలు, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కేవీ రెడ్డి, డీసీసీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపనలు, ముఖాముఖి
సభకు ముందు రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రుణాల చెక్కులు అందజేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు.
నేడు గుమ్లాపూర్‌లో సభ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గుమ్లాపూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అక్కడి నుంచే రామడుగు మండలం వెదిరలో అడ్వాన్స్‌డ్ శిక్షణా కేంద్రానికి, దత్తోజిపేటలో సోలార్ ప్లాంట్‌కు, గంగాధరలో డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తారు. కాగా బుధవారం ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు సభాస్థలిని పరిశీలించారు.


