కమీషన్ల సర్కార్‌.. వసూళ్ల రాజ్యం! | BJP Leader Nitin Nabin Comments On Revanth Reddy Govt | Sakshi
Sakshi News home page

కమీషన్ల సర్కార్‌.. వసూళ్ల రాజ్యం!

Feb 5 2026 1:54 AM | Updated on Feb 5 2026 1:54 AM

BJP Leader Nitin Nabin Comments On Revanth Reddy Govt

విజయ సంకల్ప సమ్మేళనంలో అభివాదం చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా . చిత్రంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణ, డాక్టర్‌ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ ట్యాక్స్, హఫ్తా, కమీషన్ల వసూలే  

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా ఆరోపణలు

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అవినీతి,అక్రమాలపై ప్రజల్లోకి వెళతాం 

భవిష్యత్తులో అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించేలా కార్యాచరణ 

సనాతన ధర్మంపై దాడులు కొనసాగితే ఎక్కువకాలం అధికారంలో ఉండలేరు 

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం 

2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కూడా ఖాయమన్న నితిన్‌ నబీన్‌ 

మహబూబ్‌నగర్‌లో బూత్‌స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి హాజరు

మహబూబ్‌నగర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణలో కమీషన్ల సర్కార్‌ నడుస్తోందని, వసూళ్ల రాజ్యం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాహుల్‌గాం«దీ–రేవంత్‌రెడ్డి (ఆర్‌ఆర్‌) ట్యాక్స్, హఫ్తా, కమీషన్లు వసూలు అవుతున్నాయని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  

ఇలాగైతే ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరు.. 
‘తెలంగాణలో కొన్ని నెలలుగా వరసగా దేవాలయాలు, గుళ్లపై దాడులు, కూల్చివేతల ఘటనలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కువకాలం అధికారంలో ఉండలేరు. సనాతన, హైందవ ధర్మంపై దాడులను బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. వాటిని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడే ప్రసక్తే లేదు’ అని నితిన్‌ నబీన్‌ అన్నారు.

హామీలు నెరవేర్చకుండా మోసం 
‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలను నారీశక్తిగా మార్చేందుకు, స్వశక్తితో నిలిపేందుకు   కృషి చేస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.రెండున్నర వేలు, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం వంటి వాగ్దానాలను ఎప్పుడో మరిచిపోయింది. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలకు ఈ విషయాలన్నీ వివరించాలి. ప్రస్తుతం జరుగుతున్న మోసం, దగాపై పోరాడాలి. కాంగ్రెస్‌ రైతులు, రైతుకూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదు. ఈ వర్గాలన్నీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పాలి..’అని నితిన్‌ నబీన్‌ విజ్ఞప్తి చేశారు. 

రేవంత్‌ సర్కార్‌వి సంతుషీ్టకరణ రాజకీయాలు 
‘రాష్ట్రంలో రేవంత్‌ సర్కార్‌ సంతుïÙ్టకరణ రాజకీయాలు చేస్తూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కించపరుస్తోంది. కాంగ్రెస్‌ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్‌ అని చెబుతూ నిస్సిగ్గుగా ముస్లిం ఓట్‌బ్యాంక్‌ కోసమే పనిచేస్తూ కాంగ్రెస్‌ చరిత్రను చాటుతోంది. అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం వక్ఫ్‌ భూముల్లో అక్రమాలకు వంత పాడుతున్నారు. దీనికి ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరముంది. బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు (8 శాతం ఓటింగ్‌), 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు (35 శాతం ఓటింగ్‌) గెలిచేలా ప్రజలు మద్దతు పలికారు. ఈ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుపొందుతోంది. మహారాష్ట్ర, బిహార్, చండీగఢ్, కేరళ, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించింది.  

ప్రతి బూత్‌లో 50% పైగా ఓటింగ్‌ సాధించాలి 
రాష్ట్రంలో కూడా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందున రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి పోలింగ్‌ బూత్‌లో 50 శాతానికి పైగా ఓటింగ్‌ సాధన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ విజయాలు, ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాల గురించి ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ కమలం వికసించేలా..యువ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా, అన్నివర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయాలి. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం. ఆ తర్వాత 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కూడా ఖాయం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రాకులాడడం లేదు. 

రాష్ట్ర భవిష్యత్, ఇక్కడి ప్రజల క్షేమం, అభ్యున్నతే లక్ష్యం. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రోడ్డు, రైల్వే కారిడార్లు, రెండు ఇండ్రస్టియల్‌ కారిడార్లు, మరెన్నో ప్రయోజనాలు చేకూరేలా చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల మోదీకున్న ప్రేమాభిమానాలను ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం తెలంగాణ ప్రజల పక్షానే ఉందని చెప్పడానికి ఇదే తార్కాణం..’అని బీజేపీ చీఫ్‌ స్పష్టం చేశారు. అంతకుముందు శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాం అమ్మవారికి, మైసిగండి ఉమామహేశ్వర అమ్మవారికి, తెలంగాణ విమోచన పోరాట యోధులకు, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌కు నమస్సుమాంజలి ఘటించారు. తాజాగా పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. 

మళ్లీ ఏప్రిల్‌లో వస్తా.. 
‘మున్సిపల్‌ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేయండి...మంచి ఫలితాలు సాధించండి... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తా.. ఈ సారి మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలి..మళ్లీ ఏప్రిల్‌లో వస్తా..’ అని నితిన్‌ నబీన్‌ మహబూబ్‌నగర్‌ నుంచి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పినట్లు రాంచందర్‌రావు ‘సాక్షి’ కి తెలిపారు. 

ఘన స్వాగతం 
శంషాబాద్‌: నితిన్‌ నబీన్‌ తొలిసారి తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాజసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎంపీ రఘునందన్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement