వంద రోజుల కార్యాచరణ | The government is focusing on increasing admissions in higher education | Sakshi
Sakshi News home page

వంద రోజుల కార్యాచరణ

Feb 5 2026 4:17 AM | Updated on Feb 5 2026 4:17 AM

The government is focusing on increasing admissions in higher education

ఉన్నత విద్యలో ప్రవేశాలు పెంచడంపై సర్కారు దృష్టి

ర్యాంకుల సాధనకు ప్రతి కాలేజీ చొరవ చూపేలా చేయాలి

వీసీలకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా సూచన

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు కృషి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా అధికారులకు సూచించారు. ఈ దిశగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ముందుకు తెచ్చారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో బుధవారం ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. 

పలు యూనివర్సిటీల వీసీలు కూడా పాల్గొన్నారు. డిగ్రీ కోర్సుల్లో తగ్గుతున్న ప్రవేశాలు, మధ్యలో విద్యను మానేస్తున్న విద్యార్థుల పరిస్థితి, నైపుణ్యం కొరత, కోర్సుల్లో కొత్తదనం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ లోపాలను అధిగమించే దిశగా వంద రోజుల్లో బృహత్తర కార్యాచరణకు ఏ విధంగా సిద్ధమవుతారో నివేదిక ఇవ్వాలని యోగితా రాణా కోరారు.

 నాణ్యత ప్రమాణాలకు గీటురాయిగా చెప్పుకునే జాతీయ ర్యాంకుల సాధనకు ప్రతి కాలేజీ చొరవ చూపేలా చూడాలని వీసీలకు సూచించారు. వంద రోజుల ప్రణాళికలో సమయ పాలన, ఉన్నత విద్యలో మంచి ఫలితాల సాధనకు చర్యలు, సంస్కరణలకు పెద్ద పీట వేయాలని చెప్పారు.

డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం: బాలకిష్టారెడ్డి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని చోట్ల డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యమివ్వాలని, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి సూచించారు. యూనివర్సిటీలు పాలన సామర్థ్యం పెంచుకోవాలని అన్నారు. గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలు పెంచుకునే దిశగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలని కోరారు. సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన ఈ సందర్భంగా వంద రోజుల ప్రేమ్‌వర్క్‌ను వివరించారు. 

పారిశ్రామిక భాగస్వామ్యంతో ఇంటర్న్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని, ఏఐ ఆధారిత కేరీర్‌ ఎక్సలెన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉమ్మడి గ్రాడ్యుయేట్‌ ప్రమాణాల రూపకల్పన, పరిశోధనా సౌకర్యాల ఏర్పాటు, అధ్యాపక శిక్షణ కార్యక్రమాలు, ఏకీకృత ఇంటర్న్‌షిప్‌ గ్రిడ్‌ ఏర్పాటు, పరిశోధన మిషన్‌ ఏర్పాటును ఇందులో చేర్చారు. కార్యక్రమంలో మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, పలు వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement