కన్నతల్లి చూస్తుండగానే చెల్లిని చంపిన అన్న | Brother assassinated his sister over a land dispute | Sakshi
Sakshi News home page

కన్నతల్లి చూస్తుండగానే చెల్లిని చంపిన అన్న

Feb 5 2026 4:14 AM | Updated on Feb 5 2026 4:14 AM

Brother assassinated his sister over a land dispute

భూపంపకం విషయంలో మనస్పర్థలు

మృతురాలు స్వప్న న్యాయవాది 

మొయినాబాద్‌ రూరల్‌: భూ పంపకం విషయంలో అన్నాచెల్లి మధ్య నెలకొన్న మనస్పర్థలు.. చెల్లి హత్యకు కారణమయ్యాయి. రక్తం పంచుకుపుట్టిన సొంతచెల్లిని అన్న దారుణంగా చంపేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పీఎస్‌ పరిధిలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్తయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మల్లమ్మకు సంతానం లేకపోవడంతో వెంకటమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. 

ఈమెకు కొడుకు రాజు, కూతుళ్లు సరస్వతి, స్వప్న ఉన్నారు. సరస్వతికి వివాహం కాగా, స్వప్న (34) న్యాయవాదిగా కొనసాగుతున్నారు. నెల రోజుల్లో ఆమె వివాహం జరగనుంది. వెంకటమ్మకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆరెకరాలు రాజుకు, నాలుగెకరాలు స్వప్నకు ఇవ్వాలంటూ గతంలోనే తీర్మానం చేసుకున్నారు. దీంతో ప్రైవేటు ఓ సర్వేయర్‌ను రప్పించిన స్వప్న బుధవారం ఉదయం 9 గంటలకు తల్లి వెంకటమ్మతో కలిసి భూమి కొలుస్తున్నారు. 

అక్కడే ఉన్న రాజు, మరో వ్యక్తితో కలిసి వచ్చి చెల్లి తలపై రాయితో కొట్టాడు. కన్నతల్లి చూస్తుండగానే కత్తితో గొంతుకోసి ఇద్దరూ పరారయ్యారు. చుట్టు పక్కల వారి సాయంతో స్వప్నను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. నిందితుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యాయవాదుల ఆందోళన
జూనియర్‌ న్యాయవాది స్వప్న హత్యకు గురైందనే విషయం తెలుసుకున్న పలువురు న్యాయవాదులు వివరాలు తెలుసుకునేందుకు మొయినాబాద్‌ పీఎస్‌కు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై వారు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌ న్యాయవాదులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీకి వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement