కౌండిన్య, మోర్థానలో.. వీరప్పన్‌లు! | Elephant tusk smugglers are running rampant at the state border | Sakshi
Sakshi News home page

కౌండిన్య, మోర్థానలో.. వీరప్పన్‌లు!

Feb 7 2026 5:57 AM | Updated on Feb 7 2026 5:57 AM

Elephant tusk smugglers are running rampant at the state border

తమిళనాడు ఫారెస్ట్‌శాఖకు పట్టుబడిన వారిలో పలమనేరు వాసి 

గతంలో కర్ణాటక ఏనుగు దంతాల కేసులో చిత్తూరు మూలాలు 

మూడు రాష్ట్రాల స్మగ్లర్లకు అంతర్జాతీయ మాఫియాతో లింకులు 

కౌండిన్యలో మృతిచెందే ఏనుగుల విషయం రహస్యమేనా?

రాష్ట్ర సరిహద్దులో పేట్రేగుతున్న ఏనుగు దంతాల స్మగ్లర్లు

మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్‌లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్‌ అయ్యారు.  

పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. 

తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్‌ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.

గతంలో కర్ణాటకలో వెలుగులోకి 
కర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపు 
సాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్‌ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్‌ ఫామ్‌ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్‌ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్‌ చేసి ఇందుకు సంబంధించిన కేస్‌ రిపోర్ట్‌లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్‌ కస్టోడియన్‌ స్టోర్‌ రూమ్‌లో భద్రపరుస్తారు. 

ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా? 
ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్‌ అడవుల్లో వీరప్పన్‌ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్‌  సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి.  ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మగ ఏనుగులకు మాత్రమే దంతాలు
పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్‌రేంజ్‌ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యం దాదాపు 250 చ.కి.మీగా ఉంది. ఇందులో సుమారు వంద దాకా ఏనుగులున్నాయి. ఇక ఇదే అడవికి ఆనుకొని ఉన్న మోర్థా నా రేంజ్‌ 130 చ.కి.మీగా ఉండగా ఇందులో 26 దాకా, కృష్ణగిరి, మైసూరు జిల్లాలో 320 చ.కిమీ విస్తీర్ణలో 46 దాకా ఏనుగులున్నట్టు తెలుస్తోంది. వీటిలో మగ ఏనుగులు (టస్కర్స్‌) 27 దాకా ఉన్నట్టు సమాచారం. 

ఇందులో కొన్ని మదపుటేనుగులు కౌండిన్య ఎలిఫెంట్‌ శాంచురీని దాటి భాకరాపేట అడవుల మీదుగా శేషాచలం అడవుల్లోనూ సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అటు తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం ఫారెస్ట్‌లోని మోర్థాన ప్రాంతం, క్రిష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్‌గట్టల నుంచి తరచూ కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. జిల్లాలో మొత్తం 12 మదపుటేనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు మాత్రమే ఉన్నాయి.

విదేశాల్లో భలే డిమాండ్‌ 
చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్‌ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది.

తాజాగా తమిళనాడులో... 
కౌండిన్య అభయారణ్యానికి ఆనుకొని ఉన్న తమిళనాడులోని మోర్థాన ఫారెస్ట్‌లో గత డిసెంబర్‌ 4న మూడు ఏనుగుల కళేబరాలు భయపడ్డాయి. వీటిలో మదపుటేనుగు దంతాలు కనిపించకపోవడంతో అక్కడి ఫారెస్ట్‌ అధికారులు శోధిస్తుండగా నాలుగురోజుల క్రితం గుడియాత్తంలో ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారిని విచారించగా తమకు పలమనేరు మండలంలోని ఓ వ్యక్తి ద్వారా వచ్చాయనే విషయం వెలుగుచూసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement