అటవీ శాఖ స్థలంలో నిర్మాణాల పేరుతో రాత్రివేళ జేసీబీతో నేలమట్టం
ధ్వంసమైన నవగ్రహ మండపం, దేవతామూర్తుల విగ్రహాలు
భక్తుల ఆందోళన... ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు క్రైం: గతంలో రకరకాల సాకులతో రాష్ట్రంలోని ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు మరో ఆలయంపై పడింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలోని కొన్ని నిర్మాణాలను గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు జేసీబీతో కూల్చేశారు. అదే సమయంలో అక్కడున్న నవగ్రహ మండపం కూలిపోవడంతో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి.
ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయం వెనుక భాగంలో కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వారాహి మాత ఆలయాలను దాతల సాయంతో నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోనే కొత్తగా మరొక మండపం నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, అది అటవీశాఖ స్థలమని చెప్పి గురువారం రాత్రి అటవీశాఖ రేంజ్ అధికారి (ఎఫ్‌ఆర్‌వో) హేమాంజలి సిబ్బందితో వచ్చి నూతన నిర్మాణాన్ని జేసీబీతో కూల్చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న నవగ్రహ మండపం, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి.
ఈ విషయం తెలిసి వీహెచ్‌పీ, ఇతర హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అటవీశాఖ అధికారుల తీరును తప్పుపట్టారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం కూడా హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కూడా వచ్చారు.
‘ఇది ఇక్కడి అటవీశాఖ అధికారులు చేసినపని కాదు... కర్నూలు నుంచి వచి్చన అధికారులు తొలగించారు.’ అని ఎమ్మెల్యే చెప్పారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తంచేసి.. స్థానిక అధికారులే కూల్చారని స్పష్టంచేశారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘ఈ ప్రాంతమంతా అటవీశాఖకు చెందినది. అనుమతి లేకుండా ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు’ అని చెప్పారు. దీనిపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం బయట కొత్తగా నిర్మాణాలు చేపట్టలేదని, లోపలే మండపం నిర్మిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఇక ఈ ఘటనను ఎవరూ వివాదం చేయొద్దని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన వెంటనే హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు ఆలయం ఎదుట ఎర్రగుంట్ల రోడ్డుపై బైఠాయించి ఆటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాతల సహకారంతో ఆలయం లోపల నిర్మాణాలు చేపడితే ఎలా కూల్చివేస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పోలీసులు, అటవీశాఖ అధికారులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా భక్తులు వినలేదు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సుమారు గంటన్నర తర్వాత తహసీల్దార్ గంగయ్య వచ్చి ఆలయంలో కూల్చిన కట్టడాలను 15 రోజుల్లో తిరిగి నిర్మిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


