breaking news
temple demolitions
-
తిరుచానూరులో మరో ఆలయం కూల్చివేత
సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో శ్రీఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. అదే తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడులో వందల ఏళ్ల నాటి నాగాలమ్మ ఆలయాన్ని టీడీపీ నేత అర్ధరాత్రి కూల్చేశారు. గూండాలు, రౌడీలను వెంట బెట్టుకుని ఆలయ ప్రహరీ గోడ, అమ్మవారి శూలాలు, నాగాలమ్మ పుట్టతో పాటు ఆనవాళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. దామినేడులోని సర్వే నంబరు 192/1లో 10 ఎకరాల ఇనాం భూమిలో శ్రీనాగాలమ్మ ఆలయం ఉంది.తరతరాలుగా స్థానికులు నిత్యం పూజలు చేసుకుంటూ, కుల దైవంగా కొలుస్తున్నారు. తిరుపతి రూరల్ టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత కిలారి కృష్ణమూర్తి నాయుడు పదేళ్ల క్రితం ఇదే స్థలంలో నకిలీ పత్రాలతో 7.70 ఎకరాలకు రికార్డులు సృష్టించుకున్నారు. అనంతరం పార్టీ అండతో ఆ భూమిని ఆక్రమించుకున్నారు. అందులోనే ఆలయం కూడా ఉంది. అయినప్పటికీ గ్రామస్తులు తమ కులదైవానికి పూజలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కృష్ణమూర్తి నాయుడు, అతని కుమారుడు దివాకర్.. వారు ఆక్రమించిన భూమికి ఇటీవల ఫెన్సింగ్, గేటు ఏర్పాటు చేశారు. గ్రామస్తులెవరూ ఆలయానికి రాకూడదని చెప్పారు. పథకం ప్రకారం కూల్చివేత శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కృష్ణమూర్తి నాయుడు, అతని కుమారుడు దివాకర్ పథకం ప్రకారం రౌడీలు, గూండాలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. తొలుత జేసీబీలతో ఆలయాన్ని, ఆలయ ప్రహరీని కూల్చేశారు. ఆపై అమ్మవారి వేప చెట్టు వద్ద ఉంచిన శూలాలను ధ్వంసం చేసి వేరే ప్రాంతంలో పడేశారు. నాగాలమ్మ పుట్టను సైతం ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేశారు. ట్రాక్టర్లతో మట్టిని ఎత్తిపోశారు. తెల్లవారుజామున వాహనాల శబ్ధం వినిపించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. తమ కులదైవం, ఇంటి ఇలవేల్పు ఆలయాన్ని కూల్చి వేయడంపై మండిపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు కృష్ణమూర్తి నాయుడు, అతని కుమారుడు దివాకర్ మహిళలను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురై కృష్ణమూర్తి నాయుడుపై తిరగబడ్డారు. ఆ వెంటనే రౌడీ మూకలు మహిళలు, స్థానికులపై దాడి చేసి, పిడి గుద్దులు గుద్దారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కృష్ణమూర్తి నాయుడు పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆలయం కూల్చివేత విషయం తిరుపతి ఆర్డీవోకు ముందుగానే తెలుసని, శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు ఆర్డీవోతో భేటీ కావడమే ఇందుకు తార్కాణమని స్థానికులు చెప్పారు. వారిద్దరూ ఏకాంతంగా చర్చిస్తున్న ఫొటోలను మీడియాకు అందించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకులకు తొత్తుగా మారారని, హిందూ ఆలయాలు కూల్చి వేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని దామినేడు వాసులు, హిందూ సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తారు. -
సౌదీలో స్థలమిస్తారు.. ఇక్కడ విగ్రహాలు కూల్చేస్తారా
ఆరు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సౌదీ అరేబియాకు వెళ్తే.. అక్కడ దేవాలయం కట్టుకోడానికి స్థలం ఇస్తామని ఆ దేశ పాలకులు చెప్పారని రమణానంద స్వామి చెప్పారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు నిరసనగా హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 800 సంవత్సరాల భారతదేశ చరిత్రలో విదేశీ పాలకులు చాలామంది మన దేవాలయాలను కూలగొట్టారని తెలిపారు. దేవుడి ఫొటో జేబులో పెట్టుకుంటే అరెస్టు చేసిన సందర్భాలున్నాయన్నారు. కానీ, ఇప్పుడు.. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలకు స్థలం ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాత్రికి రాత్రే కూల్చేసి తీసుకెళ్లి మునిసిపాలిటీ ఆఫీసులో పారేస్తారా అని ఆయన నిలదీశారు. ఆయన మాట్లాడుతుంటే మధ్యలో మైకు మొరాయించడంతో.. ఇది కూడా ప్రభుత్వం చెప్పి చేయిస్తోందా అని ప్రశ్నించారు. -
పుష్కరాల సమయంలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతా
అభివృద్ధి పేరుతో జరుగుతున్న దేవాలయాల విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి తెలిపారు. పుష్కరాల సమయం ఎప్పుడో చాలా ముందుగానే నిర్ణయం అవుతుందని, ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా.. అప్పటినుంచి పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు.. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుష్కరాలు వస్తున్న సమయంలో హిందూ ఆలయాలను ఇష్టారాజ్యంగా కూల్చివేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ కోసం ఇష్టారాజ్యంగా గుళ్లు, మసీదులు పగలగొట్టేస్తామంటుంటే.. అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో అర్థం కావట్లేదని చెప్పారు. దేవాలయాలను ధ్వంసం చేసిన దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో ఏ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని తెలిపారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న కూల్చివేతలను వైఎస్ఆర్సీపీ ఖండిస్తోందని ఆయన అన్నారు.