తిరుచానూరులో మరో ఆలయం కూల్చివేత | Another temple demolished in Tiruchanur | Sakshi
Sakshi News home page

తిరుచానూరులో మరో ఆలయం కూల్చివేత

Jun 15 2025 2:58 AM | Updated on Jun 15 2025 2:58 AM

Another temple demolished in Tiruchanur

ఆనవాళ్లు కూడా లేకుండా ఆలయాన్ని కూల్చేసిన దృశ్యం

అర్ధరాత్రి జేసీబీతో నాగాలమ్మ ఆలయం ధ్వంసం

టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు నిర్వాకం 

తిరుపతి కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఘటన 

సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో శ్రీఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. అదే తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడులో వందల ఏళ్ల నాటి నాగాలమ్మ ఆలయాన్ని టీడీపీ నేత అర్ధరాత్రి కూల్చేశారు. గూండాలు, రౌడీలను వెంట బెట్టుకుని ఆలయ ప్రహరీ గోడ, అమ్మవారి శూలాలు, నాగాలమ్మ పుట్టతో పాటు ఆనవాళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. 

గ్రామస్తుల కథనం ప్రకారం.. దామినేడులోని సర్వే నంబరు 192/1లో 10 ఎకరాల ఇనాం భూమిలో శ్రీనాగాలమ్మ ఆలయం ఉంది.తరతరాలుగా స్థానికులు నిత్యం పూజలు చేసుకుంటూ, కుల దైవంగా కొలుస్తున్నారు. తిరుపతి రూరల్‌ టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్‌ నేత కిలారి కృష్ణమూర్తి నాయుడు పదేళ్ల క్రితం ఇదే స్థలంలో నకిలీ పత్రాలతో 7.70 ఎకరాలకు రికార్డులు సృష్టించుకున్నారు. 

అనంతరం పార్టీ అండతో ఆ భూమిని ఆక్రమించుకున్నారు. అందులోనే ఆలయం కూడా ఉంది. అయినప్పటికీ గ్రామస్తులు తమ కులదైవానికి పూజలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కృష్ణమూర్తి నాయుడు, అతని కుమారుడు దివాకర్‌.. వారు ఆక్రమించిన భూమికి ఇటీవల ఫెన్సింగ్, గేటు ఏర్పాటు చేశారు. గ్రామస్తులెవరూ ఆలయానికి రాకూడదని చెప్పారు.   

పథకం ప్రకారం కూల్చివేత 
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కృష్ణమూర్తి నాయు­డు, అతని కుమారుడు దివాకర్‌ పథకం ప్రకారం రౌ­డీలు, గూండాలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. తొలుత జేసీబీలతో ఆలయాన్ని, ఆలయ ప్రహరీని కూల్చేశారు. ఆపై అమ్మవారి వేప చెట్టు వద్ద ఉంచిన శూలాలను ధ్వంసం చేసి వేరే ప్రాంతంలో పడేశారు. నాగాలమ్మ పుట్టను సైతం ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేశారు. ట్రాక్టర్లతో మట్టిని ఎత్తిపోశారు. తెల్లవారుజామున వాహనాల శబ్ధం వినిపించడంతో గ్రా­మ­స్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నా­రు. 

తమ కులదైవం, ఇంటి ఇలవేల్పు ఆలయాన్ని కూల్చి వేయడంపై మండిపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు కృష్ణమూర్తి నాయుడు, అతని కుమారుడు దివాకర్‌ మహిళలను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురై కృష్ణమూర్తి నాయుడుపై తిరగబడ్డారు. ఆ వెంటనే రౌడీ మూక­లు మహిళలు, స్థానికులపై దాడి చేసి, పిడి గుద్దులు గుద్దారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

కృష్ణమూర్తి నాయుడు పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆలయం కూల్చివేత విషయం తిరుపతి ఆర్డీవోకు ముందుగానే తెలుసని, శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు ఆర్డీవోతో భేటీ కావడమే ఇందుకు తార్కాణమని స్థానికులు చెప్పా­రు. వారిద్దరూ ఏకాంతంగా చర్చిస్తున్న ఫొటోలను మీడియాకు అందించారు. 

పోలీసు, రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకులకు తొత్తుగా మారారని, హిందూ ఆలయాలు కూల్చి వేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని దామినేడు వాసులు, హిందూ సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement