సాక్షి,అమరావతి: ఏపీలో ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా యుడైస్ (UDISE+) నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో పాఠశాలలు మూతపడటంతో పాటు, లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రంగా నిర్వీర్యమవుతోందనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ కేంద్ర విద్యాశాఖ ఈ అధికారిక గణాంకాలను బయటపెట్టింది.
యుడైస్ నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండేళ్లలో మొత్తం 972 పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ఇందులో 778 ప్రభుత్వ పాఠశాలలు కాగా, 194 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇందులో సింహభాగం.. అంటే ఏకంగా 644 పాఠశాలలు కేవలం గత ఒక్క ఏడాది కాలంలోనే మూతపడటం గమనార్హం.
గతంలో 45,000 గా ఉన్న ప్రభుత్వ బడుల సంఖ్య ఇప్పుడు 44,222 కి పడిపోయింది. గతంలో 991గా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థల సంఖ్య ప్రస్తుతం 797కి క్షీణించింది. పాఠశాలల మూతతో పాటు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు ఊహించని స్థాయిలో పడిపోయింది. 2023-24 విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు చదువుతుండగా.. 2025-26 నాటికి ఆ సంఖ్య ఏకంగా 34.93 లక్షలకు తగ్గిపోయింది. అంటే గడిచిన రెండేళ్లలోనే 5.86 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి వెళ్లిపోయారు.
'నాడు-నేడు', 'మధ్యాహ్న భోజనం' నిర్వీర్యమే కారణమా?
గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల రూపురేఖలను మార్చడానికి ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు’ మౌలిక వసతుల కల్పన కార్యక్రమం, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ‘మధ్యాహ్న భోజన పథకం’ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విద్యా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. బడుల్లో కనీస మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరత, విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్లే పేద తల్లిదండ్రులు సైతం అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న ప్రచారాల వెనుక ఉన్న అసలు బండారాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికే క్షేత్రస్థాయి గణాంకాలతో సహా బహిర్గతం చేయడం గమనార్హం


