సాక్షి, పోలవరం: రంపచోడవరం మండలంలోని ఇర్లపల్లి కొత్త కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రేకు షేడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతురాలిని రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివానిగా గుర్తించారు. సోమవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం పక్కన..
ఇటీవల జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌లో శివానికి ప్రత్యేక అవకాశం లభించింది. ఈనెల 24న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఆమె మాట్లాడింది. ఆపై ఆయనతో ఫొటో కూడా దిగింది. చంద్రబాబుతో ముచ్చటించిన బాలిక ఇలా అనూహ్యంగా మృతి చెందడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అనుమానాస్పద మృతిగా కేసు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శివాని మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
చంద్రబాబు దిగ్భ్రాంతి
విద్యార్థిని మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని.. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని… pic.twitter.com/9NZE0spqgv
— N Chandrababu Naidu (@ncbn) July 27, 2026
విద్యార్థులు, యువత సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని.. ఒత్తిడి, నిరాశకు లోనుకావద్దని సూచించారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, తమ బాధలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.


