కూటమిలో చిచ్చు.. మాకే ఆహ్వానం లేదా!? | Lokam Madhavi Name Missing From Bhogapuram Event Invite | Sakshi
Sakshi News home page

కూటమిలో చిచ్చు.. మాకే ఆహ్వానం లేదా!?

Jul 27 2026 11:07 AM | Updated on Jul 27 2026 11:30 AM

Lokam Madhavi Name Missing From Bhogapuram Event Invite

సాక్షిప్రతినిధి, విజయనగరం: మన ఊరిలో మీటింగ్‌ పెట్టి మనకు ఆహ్వానం లేకపోవడమా..? వంటలన్నీ మనతో చేయించి మనకు పళ్లెం వేయకపోవడమా? మనతో ఫంక్షన్‌ కుర్చలు సర్దించి మనను చివరకు గుమ్మం బయట నిలబెడితే ఎలా ఉంటుంది? అచ్చం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిస్థితిలానే ఉంది. బయటకు చెప్పలేక.. ఎవరికీ చెప్పుకోలేక.. క్యాడర్‌ ముందు బిల్డప్‌ కొట్టుకోలేక.. అబ్బబ్బ ఈ కష్టాలు.. అవమానాలు పగవాడిక్కూడా రావద్దు సుమీ..! అన్న వ్యాఖ్యలు నెల్లిమర్ల నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. 

ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు వస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పాల్గొంటున్నట్టు ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎమ్మార్‌ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. అందులో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

ఎయిర్‌ఫోర్ట్‌ ప్రారంభానికి ముందు ప్రధాని పర్యటన ఏర్పాట్లు అంటూ రోజూ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడం.. ఏర్పాట్లు.. పర్యవేక్షణ అంటూ హడావుడి చేయడం తప్ప ఆఖరుకు జీఎంఆర్‌ వారు వేసిన ఆహ్వాన పత్రంలో కూడా ఎమ్మెల్యే పేరు లేకపోవడం పార్టీ క్యాడర్‌ను ఆవేదనకు గురిచేస్తోంది. 

ఎయిర్‌పోర్టు రానీయండి.. వేలల్లో ఉద్యోగాలు..
ఇక మీ జీవితాలు మారిపోతాయి.. ఇంటికో ఉద్యోగం.. రెండు చేతుల్లో డబ్బులు గలగలా అంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రంలో పేరు లేకపోవడం చూసి.. ఆమె స్థాయి ఇంతేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, దీనివెనుక స్థానిక టీడీపీ నేతల కుతంత్రం ఉందన్న వ్యాఖ్యలు జనసేన క్యాడర్‌ నుంచి వినిపిస్తున్నాయి.  

స్థానిక ఎమ్మెల్యేకు లేని ప్రాధాన్యం లోకేశ్‌కు ఎలా ? 
ఎంతపెద్ద నాయకుడు వచ్చినా స్థానిక నాయకత్వానికి అయితే ప్రత్యేక ప్రొటోకాల్‌ ఉంటుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు వేదిక మీద సీట్లు ఉంటాయి. కానీ ప్రధాని కార్యక్రమానికి మాత్రం స్థానిక ఎమ్మెల్యే మాధవికి ప్రత్యేక ఆహ్వానం లేకపోవడం ఆమెను జీఎమ్మార్‌ లైట్‌ తీసుకున్నట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ ప్రాంతానికి, ఆ ప్రాజెక్టుకు సాంకేతికంగా ఎలాంటి అనుబంధం లేని లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ వంటివారికి ఎలా ప్రాధాన్యం ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement