breaking news
Elephant tusks
-
కౌండిన్య, మోర్థానలో.. వీరప్పన్లు!
మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకి కర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపు సాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్‌ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్‌లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్‌లో భద్రపరుస్తారు. ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా? ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మగ ఏనుగులకు మాత్రమే దంతాలుపలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్రేంజ్ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యం దాదాపు 250 చ.కి.మీగా ఉంది. ఇందులో సుమారు వంద దాకా ఏనుగులున్నాయి. ఇక ఇదే అడవికి ఆనుకొని ఉన్న మోర్థా నా రేంజ్ 130 చ.కి.మీగా ఉండగా ఇందులో 26 దాకా, కృష్ణగిరి, మైసూరు జిల్లాలో 320 చ.కిమీ విస్తీర్ణలో 46 దాకా ఏనుగులున్నట్టు తెలుస్తోంది. వీటిలో మగ ఏనుగులు (టస్కర్స్) 27 దాకా ఉన్నట్టు సమాచారం. ఇందులో కొన్ని మదపుటేనుగులు కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని దాటి భాకరాపేట అడవుల మీదుగా శేషాచలం అడవుల్లోనూ సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అటు తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం ఫారెస్ట్‌లోని మోర్థాన ప్రాంతం, క్రిష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్‌గట్టల నుంచి తరచూ కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. జిల్లాలో మొత్తం 12 మదపుటేనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు మాత్రమే ఉన్నాయి.విదేశాల్లో భలే డిమాండ్ చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది.తాజాగా తమిళనాడులో... కౌండిన్య అభయారణ్యానికి ఆనుకొని ఉన్న తమిళనాడులోని మోర్థాన ఫారెస్ట్‌లో గత డిసెంబర్ 4న మూడు ఏనుగుల కళేబరాలు భయపడ్డాయి. వీటిలో మదపుటేనుగు దంతాలు కనిపించకపోవడంతో అక్కడి ఫారెస్ట్ అధికారులు శోధిస్తుండగా నాలుగురోజుల క్రితం గుడియాత్తంలో ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారిని విచారించగా తమకు పలమనేరు మండలంలోని ఓ వ్యక్తి ద్వారా వచ్చాయనే విషయం వెలుగుచూసింది. -
కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. కొంతకాలంగా ఆయనను ఏనుగు దంతాల కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తనపై వేసిన ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివరాలు.. గతంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు ఇప్పటికే మోహన్ లాల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడిచింది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని చెప్పింది. ఆయన వాటిని చట్టప్రకారమే ఇంట్లో పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విచారణలో వెల్లడించింది. అయితే ప్రభుత్వ వైఖరిని మేజిస్ట్రేట్ కోర్టు తప్పుబట్టింది. అదే ఓ సామన్యుడు ఏనుగు దంతాలను కోనుగులు చేసి ఉంటే అతడికీ ఇలాంటి మినహాయింపే ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వ్యతిరేకంగా మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్ సిగ్నల్? విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ -
రూ.కోటి విలువైన ఏనుగు దంతాల పట్టివేత
ముగ్గురి అరెస్టు అల్వాల్ : కోటి రూపాయల విలువైన ఏనుగు దంతాలను అల్వాల్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన వీకేఎస్ బోస్ తన వద్ద ఉన్న ఏనుగు దంతాలను అమ్మిపెడితే కమీషన్ ఇస్తానని కుంచర్లపాటి సూర్యనారాయణ రాజుకు చెప్పాడు. సూర్యనారాయణ రాజు నగరంలోని అమీన్‌పూర్‌కు చెందిన మున్నూర్ ఫణీందర్(26) ద్వారా మోతీనగర్‌కు చెందిన రియల్టర్ నున్న అరవింద్‌రెడ్డికి ఏనుగు దంతాల గురించి తెలియజేశాడు. అతను ఏనుగు దంతాలు తీసుకొని రమ్మని చెప్పడంతో సూర్యనారాయణరాజు వైజాగ్ నుంచి ఏనుగుదంతాలను నగరానికి తెచ్చి.. అల్వాల్ గ్రీన్‌ఫీల్డ్స్‌లో ఉన్న అరవింద్‌కుమార్‌ను కలిశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులు సూర్యనారాయణరాజు, ఫణీందర్, అరవింద్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, 5 సెల్ఫోన్లు, మారుతీ స్విఫ్టు కారు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు వైజాగ్‌కు చెందిన వీకేఎస్ బోస్ పరారీలో ఉన్నాడు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లో కె.నరసింగరావు, ఎన్సీహెచ్ రంగస్వామి, ఎ.రాములు ఎస్ఓటీ ఈస్ట్‌జోన్ సిబ్బంది, మల్కాజగిరి పోలీసులు పాల్గొన్నారు.


