న్యూఢిల్లీ: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందన కోరింది. ఈ కేసుకు సంబంధించి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు సీబీఐ కూడా ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2026 నవంబర్ 16వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
2002 అక్టోబర్‌లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ నవంబర్ 21న మృతి చెందారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయగా, 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ రామ్ రహీమ్ హైకోర్టును ఆశ్రయించగా, తగినన్ని సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2026 మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.
దిగువ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసింది. కాగా, ఈ కేసులోని మరో ముగ్గురు దోషుల శిక్షలను మాత్రం హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రామచంద్ర ఛత్రపతి కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై అప్పీల్ చేయలేదని ప్రస్తావిస్తూ రామ్ రహీమ్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పుపై నవంబర్‌లో జరిగే విచారణలో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: కొరియా కార్యాలయాల్లో.. బయటకు చెప్పుకోలేని ఐదు నిజాలు!


