తమిళనాడులో భాషా రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. మంత్రి తమిళ ఉచ్చారణ, వ్యాకరణంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగా.. బీజేపీ కూడా రంగంలోకి దిగి తమిళ భాషను గౌరవించాలని డిమాండ్ చేసింది. దీంతో ‘భాషా ప్రేమ’ వర్సెస్ ‘వ్యక్తిగత శైలి’ అనే చర్చ మొదలైంది.
ఆగస్టు 5న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తమిళంలో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో పలుచోట్ల వ్యాకరణ, ఉచ్చారణ లోపాలు కనిపించాయని డీఎంకే ఎమ్మెల్యే టీ.ఎం. రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడాలి” అని తాజాగా జరిగిన చర్చలో ఆయన సూచించారు. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ వంటి కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు భాషపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.
‘నా తమిళం.. నా స్టైల్’
డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి మేరీ విల్సన్ తీవ్రంగా స్పందించారు. తన మాట్లాడే విధానాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. “నా తమిళం గురించి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రత్యేక శైలి. నేను ఇలాగే మాట్లాడగలను. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇదే నా శైలి. మీ కోసం నేను మార్చుకోలేను” అంటూ మంత్రి ఘాటుగా బదులిచ్చారు.
వివాదం పెరగడంతో అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యులు ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు అర్థం చేసుకునేలా మంత్రి ప్రసంగించారని, భాషపై చర్చను సానుకూలంగా చూడాలని కోరారు.
మతం ప్రస్తావనతో మరింత వేడి
తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ మంత్రి విల్సన్ తన మత విశ్వాసాలను ప్రస్తావించారు. “క్రైస్తవం నాకు ప్రేమ, సానుభూతి అనే ఒకే భాషను నేర్పింది. నేను బైబిల్ నుంచి దాన్ని నేర్చుకున్నాను. నేను పుట్టుకతో క్రైస్తవుడిని” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. భాషా వివాదంలోకి మత ప్రస్తావన రావడంపై పలువురు స్పందించారు.
‘తప్పులను అంగీకరించాలి’: డీఎంకే
డీఎంకే సీనియర్ నేత టీ.కే.ఎస్. ఇళంగోవన్ మంత్రి తీరుపై విమర్శలు చేశారు. “బడ్జెట్ చదివే సమయంలో అనేక చోట్ల తమిళంలో తప్పులు జరిగాయి. దాన్ని అంగీకరించకుండా సమర్థించుకోవడం సరికాదు. ఆర్థిక మంత్రి భాషను సరిగ్గా చదవగలగాలి” అని అన్నారు.
తమిళంను అవమానించొద్దు: బీజేపీ
ఈ వివాదంలో బీజేపీ కూడా జోక్యం చేసుకుంది. తమిళ భాషను తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. “మతం ఏదైనా కావచ్చు. కానీ భావోద్వేగం, గుర్తింపు పరంగా మనమంతా తమిళులమే. మీ మతాన్ని గౌరవించడంలో తప్పులేదు. కానీ తమిళ భాషను కించపరిచే వ్యాఖ్యలను అంగీకరించలేం. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
విజయ్ సూచన
తమిళ భాషపై రేగిన వివాదంపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి విల్సన్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. “తమిళం మన అస్తిత్వం.. దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ సూచించినట్లు సమాచారం.
భాషా గౌరవమా? వ్యక్తిగత స్వేచ్ఛా?
ఈ వివాదం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం “తమిళం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటి.. దాన్ని సరిగ్గా మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటుండగా.. మరోవర్గం “భాషలో చిన్న తప్పుల కంటే ప్రజలకు అర్థమయ్యేలా పాలన అందించడం ముఖ్యం” అని వాదిస్తోంది.


