చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా? | Kommineni Srinivasa Rao Comments On Chandrababu 46 Lakh Jobs | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?

Aug 11 2026 10:54 AM | Updated on Aug 11 2026 11:32 AM

Kommineni Srinivasa Rao Comments On Chandrababu 46 Lakh Jobs

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. 

ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.

గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.

ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. 

ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.

విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్‌లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్‌లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. 

అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్‌లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement