ఆత్మకూరు రూరల్: నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పెద్ద పులుల అసహజ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై దర్యాప్తు సాగుతుండగానే మరో పెద్దపులి ఉచ్చులకు చిక్కి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పులి కళేబరాన్ని రహస్యం గా దహనం చేసినట్లు తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు కిందిస్థాయి అటవీ సిబ్బందిని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు సమాచా రం.
ఈ కేసులో ఇటీవల ఎఫ్‌బీవో నుంచి ఎఫ్‌ఎస్‌ఓ గా పదోన్నతి పొందిన ఒక జూనియర్ అధికారిపై వేటు కూడా పడనున్నట్లు చర్చ జరుగుతోంది. గతేడాది వర్షాకాలం ఆరంభంలో నాగలూటి రేంజ్ ఇందిరేశ్వరం సెక్షన్ పరిధిలో ఓ పులి ఉచ్చులో చిక్కుకుని మరణించి కనిపించింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గుట్టుగా దహ నం చేసినట్లు సమాచారం.
ఇటీవల గిద్దలూరు, ఆత్మకూరు డివిజన్లలో 2 పెద్దపులులు అసహజ మరణాలకు గురైన ఘటనలపై దర్యాప్తు జరుపుతున్న క్రమంలో రహస్యంగా మరో పులి కళేబరాన్ని దహనం చేసిన అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని ఆత్మకూరు డిడి విగ్నేష్ అపావ్‌ను చెప్పారు.


