బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి? | KSR's Comments On Chandrababu Naidu Amaravati Land Pooling Costs | Sakshi
Sakshi News home page

బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?

Sep 26 2026 11:53 AM | Updated on Sep 26 2026 12:45 PM

KSR's Comments On Chandrababu Naidu Amaravati Land Pooling Costs

ఎవరైనా వెయ్యి రూపాయలతో అయ్యే పనికి ఐదువేలో, పది వేలో ఖర్చు చేస్తారా? అలా చేస్తామని అంటే జనం ఏమని అనుకుంటారు? అయితే చేతకాని తనమన్నా కావాలి. లేదా ఏదైనా స్వార్ధ ప్రయోజనం ఉండి ఉంటుందని అనుకోరా? సరిగ్గా ఇదే రీతిలో ఏపీ రాజధాని అమరావతి గ్రామాలలో జరుగుతోందనిపిస్తోంది.

కొత్త ఎయిర్ పోర్టు కోసం ఇరవై వేల ఎకరాలు, రైల్వే లైన్, గ్రిడ్ రోడ్డు విస్తరణ వంటి కోసం 6212 ఎకరాలు తీసుకుంటారట. ఎయిర్ పోర్టుకు ఐదువేల ఎకరాలు సరిపోతుంది. కాని నాలుగురెట్లు ఎక్కువగాను, రైల్వేలైన్, తదితర అవసరాలకు 1581 ఎకరాలు చాలు. కాని నాలుగు రెట్లు అదనంగా పూలింగ్ చేస్తారట. ఇప్పటికే విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. గతంలో దాని విస్తరణకు రైతులనుంచి భూములు తీసుకున్నారు. ఆ రైతులందరికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని ఈ మధ్యనే ఎయిర్ పోర్టు వద్ద ధర్నా కూడా జరిగింది.

అయితే కొంతమంది పలుకుబడి కలిగినవారు ఈ భూములకు బదులు అమరావతి ప్రాంతంలో విలువైన ప్లాట్లు పొందారని కూడా చెబుతారు. దీనిని పక్కనబెడితే కూటమి ప్రభుత్వానికి లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా, కొత్తగా మరో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన వచ్చింది. అది కూడా విజయవాడ, గుంటూరులకు సుదూరంగా ఉండే మారుమూల గ్రామాలలో కావడం విశేషం. 

ఇందుకోసం ఐదువేల ఎకరాలు అవసరమట. కాని 20వేల ఎకరాలు సేకరించవలసి ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పీ.నారాయణ ప్రకటించారు. అదేమిటి? నాలుగు రెట్లు అధికంగా భూములు తీసుకోవడం ఏమిటన్న సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే 20వేల ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఐదువేల ఎకరాలే మిగులుతుందట. మిగిలిన భూమిలో ప్లాట్లు అభివృద్ది చేసి రైతులకు ఇవ్వవలసి ఉంటుందట. అలాగే విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇతర అవసరాలకు కేటాయించాలట. ఇదే ప్రకారం రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గ్రిడ్ రోడ్లకు కూడా తీసుకుంటారట.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రానికి రాసిన ఒక లేఖ ప్రకారం ప్లాట్ల అభివృద్దికి ఎకరాకు రెండు కోట్లు వ్యయం అవుతుంది. అది ఇప్పుడు మరికొంత పెరిగిందేమో తెలియదు. ఈ రకంగా చూస్తే ఎయిర్ పోర్టు భూమి పోను మిగిలిన 15వేల ఎకరాలనే పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు మినిమమ్ రెండు కోట్ల చొప్పున ముప్పైవేల కోట్ల వ్యయం అవుతుందన్నమాట. ఇంత భారీ వ్యయం చేసే బదులు అవసరమైన ఐదువేల ఎకరాలకు రెండు కోట్ల చొప్పున లెక్కగట్టి ఇస్తే పదివేల కోట్లు సరిపోతుంది కదా!లేదా మూడు కోట్లు ఇచ్చినా 15వేల కోట్లు అవుతుంది.

రైల్వే లైన్ తదితర అవసరాలకోసం ఈ ప్రకారం లెక్కవేస్తే ప్లాట్ల అభివృద్దికే 18వేల కోట్లు అవుతుంది. కాని కొనుగోలు చేస్తే పది, పన్నెండువేల కోట్లు మించి కాకపోవచ్చు. దీనిని వదలి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి ఎందుకు భూములు సేకరిస్తున్నట్లు? రైతులకు ప్లాట్ల అభివృద్ది జరిగే వరకు కౌలు రూపేణా, రుణాల మాఫి రూపేణా, ఇతరత్రా కోట్ల రూపాయల మెత్తాలను వెచ్చించవలసి ఉంటుంది. దీనిని బట్టి ఏం అర్దం అవుతుంది. వెయ్యి రూపాయల ఖర్చు అయ్యేదానిని మూడు, నాలుగు రెట్లకు పెంచుతున్నారనిపించదా? ప్రభుత్వం ఏదో రకంగా దీనిని సమర్ధించుకోవచ్చు. కానీ అందులో హేతుబద్దత ఎంత అన్నదే చర్చ.

ఇదీ చదవండి: నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!

హైదరాబాద్ శంషాబాద్ వద్ద రైతుల నుంచి భూములను ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించిన అనుభవం ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పూలింగ్ వైపే వెళుతోంది. రైతుల నుంచి భూములు తీసుకోవడంతో పచ్చని పంట పొలాలను నాశనం చేయడం ఒక ఎత్తు అయితే, వారి వద్దే భూములు ఉంటే ఎప్పుడైనా తమకు నచ్చిన రేటుకు అమ్ముకునే అవకాశం ఉండడం మరో ఎత్తుగా ఉంటుంది. వీటన్నిటిని కాదని ప్రభుత్వం భూములు తీసుకోవడం, నిర్మాణాల పేరిట వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి మరీ వ్యయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐఎఎస్, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ తదితరులు ముందుగా ఇప్పటికే తీసుకున్న భూమిని అభివృద్ది చేయకుండా కొత్తగా భూములు తీసుకోవడం ఏమిటని, పలు అనుభవాల రీత్యా చంద్రబాబునునమ్మడం ఎలా అని ప్రశ్నించారు. రెండో దశ భూ సేకరణ అంటే అవినీతికోసమేనని మరో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం ఆరోపించారు. ఎవరు ఎన్ని హితోక్తులు చెప్పినా, విమర్శలు చేసినా.. ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఆయా భవనాల నిర్మాణానికి పెడుతున్న వ్యయం చూస్తే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే.

శాశ్వత సచివాలయ టవర్ల అద్దాలకు 2455 కోట్లు వ్యయం చేయబోతున్నారు. ఇందులో తొలుత ఉన్న అంచనా వ్యయం కన్నా 500 కోట్లు అధికంగా ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. అమరావతిలో విద్యుత్ సరఫరాను ప్రైవేటుకు అప్పగించాలన్నది మరో ఆలోచనట. దీనిపై నివేదికలు తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. ఇప్పటికే వేల కోట్ల వ్యయం చేసి అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్డిఏ తయారు చేస్తోంది. అంతా సిద్దం అయ్యాక ప్రైవేటువారికి దీనిని అప్పగిస్తారా? లేక ముందే ప్రైవేటుకు అప్పగిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇదంతా వినియోగదారులపై భారం కాదా అన్నది కొందరి సందేహం.

అమరావతి చుట్టూరా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలన్నది మరో ప్రతిపాదన. కేంద్రం దీనిపై కొన్ని అభ్యంతరాలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. సుమారు 30వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా అయితే ఇందులో రాష్ట్రం కూడా నాలుగువేల కోట్లకు పైగా భరించాల్సి ఉంటుందట. అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించడంలో భాగంగా కేవలం భవన శిఖరం(డూమ్) నిర్మాణానికి 660 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారట. పార్లమెంటు కొత్త భవనం, తెలంగాణ సచివాలయంలకు పెట్టిన ఖర్చుతో పోల్చితే ఏపీ ఖర్చు గుండె బేజారెత్తిస్తుందని చెప్పాలి.

కొండవీటి వాగు వరదనుంచి రక్షణ పొందడానికి కొన్నివందల కోట్లు వ్యయం చేస్తున్నారు. కృష్ణానది కుడి కరకట్ట విస్తరణకు 443 కోట్లు వెచ్చించబోతున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సెంట్రలైజ్‌డ్ కూలింగ్ వ్యవస్థ కోసం 415 కోట్లు పెట్టబోతున్నారు. గవర్నర్ నివాస భవన సముదాయానికే 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా అట. అమరావతిలో పెడుతున్న ఖర్చులో ఇవి కొన్నే. ఇందులో దుబారా, అవినీతిపై ఎవరైనా ప్రశ్నించినా పట్టించుకునే దశలో చంద్రబాబు సర్కార్ లేదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరినుంచి వసూలు చేసే పన్నులలో నుంచే అమరావతి అప్పులను తీర్చవలసి ఉంటుంది. ఒకపక్క ఎల్ నినో కారణంగా కరువు తాండవిస్తుంటే, మరో పక్క అమరావతిలో వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెచ్చించడం న్యాయమా అని సామాన్యుడు ప్రశ్నించినా వినే నాధుడు లేడు.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement