ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ పాలనను వ్యతిరేకించే విధంగా వ్యవహరించిన కొందరు మేధావులు, మాజీ అధికారులలో మార్పు కనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న మరికొంతమంది సైతం ప్రభుత్వంపై స్పందిస్తున్న తీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
గతంలో న్యాయాధికారిగా పనిచేసి జడ శ్రవణ్‌కుమార్ ఇటీవలికాలంలో కూటమి ప్రభుత్వ వైఖరిని తూర్పారాపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన గత ప్రభుత్వ టైమ్‌లో అమరావతి తదితర అంశాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశారు. వివిధ ఆందోళనలలో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఆయన విసిగిపోయారు. సొంత రాజకీయ పార్టీని స్థాపించుకుని పనిచేస్తున్న శ్రవణ్ ప్రజా సమస్యలపై గళం విప్పారు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను కూడా వెలుగులోకి తెస్తున్నారు.
చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తికి, ఆయన రిటైర్ అయ్యాక లోకాయుక్త పదవిని ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించి శ్రవణ్ న్యాయపోరాటానికి సిద్దం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని విధానంపై విరుచుకుపడుతున్నారు. మంత్రి నారా లోకేష్‌పై అవినీతి అభియోగాలు మోపుతూ మీడియా సమావేశాలు పెడుతున్నారు. డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో శ్రవణ్ అంతగా స్పందించలేదు. అందులో అక్రమాలు ఉన్నాయా? లేదా? అన్న సందేహం ఆయనకు వచ్చినట్లు ఉంది.
కాని గత కొద్ది రోజులుగా ఆయనకు వచ్చిన ఆధారాల మేరకు డీఎస్సీపై అవకతవకలపై విరుచుకుపడుతున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినవారికి సంబంధించి అక్రమాలు జరిగాయని ఆయన చెబుతున్నారు. క్రీడా కోటాలో అనర్హులకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్‌సీపీ గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. జై భీమ్ పార్టీని స్థాపించిన జడ శ్రవణ్ కూటమికి అధినేతలకు దూరం అవడమే కాకుండా, స్వతంత్రంగా ఆ ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు.
మరో రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తారని రెండేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. కూటమి అధికారంలోకి రాగానే ఈయనకు కీలకమైన పదవి వస్తుందని చాలామంది అనుకున్నారు. కాని అనూహ్యంగా ప్రాధాన్యత లేని పోలీస్ హౌసింగ్ సంస్థ చైర్మన్ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఇది ఒక రకంగా అవమానించడమేనని ఆయన సన్నిహితులు చాలామంది బాధపడ్డారు. అయినా చంద్రబాబు కాని, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి లోకేష్ గాని పట్టించుకున్నట్లు లేదు. ఆ తర్వాత క్రమేపి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఏబీవి కూడా ధ్వజమెత్తడం ఆరంభించారు.
ముఖ్యంగా 22-ఎ నిషేధిత భూముల జాబితా విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుపోయినట్లు భూములను ప్రభుత్వంలోని వారు ఎత్తుకపోయారని గళమెత్తారు. అమరావతి రెండో దశ భూ సమీకరణ అంతా అవినీతే అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య కూడా గమనించదగిందే. రాష్ట్రంలో సహకార డెయిరీ రంగం మూల పడుతోందని ఆయన అన్నారు. సహకార డెయిరీ రంగం 'మూడు " పువ్వులు, అనేకానేక కాయలు అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు.
ఇదీ చదవండి: బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?
అలాగే ఒక ప్రముఖ టీవీ యాజమాన్యంలో మార్పుల గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. అది అసలు వార్తే కాదట.. కొనుక్కుని చదివే పాఠకులు వర్సెస్ ప్రకటనలు విసిరే పాలకులు.. ఎవరి ప్రయోజనాలు ముఖ్యం అని ఆయన ప్రశ్నించారు. ఏవి తల్లి నాడు విరిసిన విలువలు, అభ్యుదయాలు? అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఈటీవిని టీడీపీకి చెందిన ముఖ్యనేతలలో ఒకరు తన అధీనంలోకి తీసుకున్నారని ప్రచారం అవుతున్న పరిస్థితిలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
మరో సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి అయిన నారా బ్రాహ్మణి ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుపై ఆయన ఘాటుగా స్పందించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండి విడుదలై మూడేళ్లు అవుతున్న సందర్భంగా నిజం గెలిచింది అంటూ, 53 కొవ్వొత్తులు వెలిగించిన వీడియోని ఆమె పోస్టు చేశారు.
ఈ పోస్టుపై నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండొ, ఇరవైరెండెకరాలతోనో 1970వ దశకంలో రాజకీయ జీవితం ఆరంభించి, ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకువచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును నిస్వార్థ అవినీతిపరుడు అని కూడా ఎద్దేవ చేశారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టీ.రామారావుకు వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన విమర్శించారు. ఏపీ విభజనకు లేఖ ఇవ్వడంతో తెలుగుజాతికి తీరని ద్రోహం చేశారని చంద్రబాబుపై నాగేశ్వరరావు మండిపడ్డారు.
మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విశాఖపట్నం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా డేటా సెంటర్లు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా వంటి దేశాలు డేటా సెంటర్లను వదలించుకుంటుంటే, ఇండియా వంటి దేశాలు ఎదురు రాయితీలు ఇచ్చి తెచ్చుకోవడం ఏమిటని అన్నారు. అందులో విశాఖలో వీటిని అధికంగా ఏర్పాటు చేయడం వల్ల వచ్చే నీరు, విద్యుత్ సమస్యలను ఆయన ప్రస్తావించారు.
ఇంకో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో మెటాకు ఫిర్యాదు చేసి సోషల్ మీడియా పోస్టులను తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిని నేరపూరిత దుష్ప్రవర్తనగా ఆయన అభివర్ణించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వీరే కాదు. మరికొందరు మేధావులు కూడా ప్రభుత్వంలో జరుగుతున్న వివిధ అక్రమాలు, వివాదాస్పద అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తున్న తీరు స్వాగతించదగిందే!
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


