గే డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తిని ప్రలోభపెట్టి నగదు దోచుకున్న సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకరరావు వివరాలు వెల్లడించారు. మండలంలోని అరట్లకట్ట గ్రామం సమీపంలో ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ఒకరు ఈ నెల 14వ తేదీ రాత్రి గే డేటింగ్ యాప్ ద్వారా బాధితుడిని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించారు. అక్కడ కాపుకాచిన మరో నలుగురు వ్యక్తులతో కలిసి బాధితుడిని కత్తితో బెదిరించి, పర్సులోని రూ. 3 వేలు నగదుతో పాటు సెల్‌ఫోన్, రెండు ఏటీఎం కార్డులను లాక్కున్నారు.
పాస్‌వర్డ్స్ చెప్పకపోవడంతో చంపుతామని బెదిరించి బలవంతంగా పిన్ నెంబర్లు రాబట్టారు. ఇద్దరు నిందితులు ఫోన్, ఏటీఎం కార్డులతో బయటకు వెళ్లి నగదు డ్రా చేస్తుండగా, మిగతా ముగ్గురు బాధితుడిని సుమారు మూడు గంటల పాటు నిర్బంధించారు. రాత్రి 11 గంటల సమయంలో ఫోన్, కార్డులు బాధితుడికి ఇచ్చి నిందితులు పరారయ్యారు. పరిశీలించగా ఏటీఎం ద్వారా రూ. 22,495 బదిలీ అయినట్లు తేలింది. మొత్తం రూ. 25,495 బాధితుడి నుంచి దోచుకున్నట్లు గుర్తించారు.
బాధితుడు ఈ నెల 21న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా బుధవారం పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో మంగం అఖిల్, ఒరుగంటి మోహన్‌తేజవర్మ, పీతల భీమ కార్తీక్, పితాని సతీష్ గుత్తుల సురేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 20 వేల నగదు, ఒక కత్తి, రెండు మోటార్ సైకిళ్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్, ఎస్సై సురేంద్ర, ఐడీ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
-ఏలూరు జిల్లా
చదవండి: నీ పిల్లకు మరో యువకుడితో పెళ్లి.. జైలు నుంచి తప్పించుకో!


