క్రాంతికుమార్‌ ఆత్మహత్యకు కారణం ఏమిటి? | High Court issues notices to AP Govt, DGP, and police officials | Sakshi
Sakshi News home page

క్రాంతికుమార్‌ ఆత్మహత్యకు కారణం ఏమిటి?

Sep 24 2026 5:44 AM | Updated on Sep 24 2026 5:44 AM

High Court issues notices to AP Govt, DGP, and police officials

రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, ఇతర పోలీసులకు హైకోర్టు నోటీసులు

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని నిర్దేశం 

ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని పిటిషనర్‌ను బెదిరించవద్దని స్పషీ్టకరణ 

ఎస్‌సీ ఎస్‌టీ కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు చేయాల్సిందే 

సంచలనం సృష్టించిన క్రాంతికుమార్‌ సెల్ఫీ వీడియో 

తన ఆత్మహత్యకు సీఐ నాగరాజు వేధింపులే కారణమని ఆవేదన

సాక్షి, అమరావతి: దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఘటనపై హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది. విజయవాడ, కృష్ణలంక అప్పటి సీఐ నాగరాజు వేధింపుల వల్ల క్రాంతికుమార్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ కమిషనర్, నార్త్‌ జోన్‌ ఏసీపీ, కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌లతో పాటు క్రాంతికుమార్‌ ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ నాగరాజుకు నోటీసులు జారీచేసింది.  ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద నమోదైన కేసులో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఘటనపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పిటిషనర్‌ కుటుంబ సభ్యులను ఏ రకంగానూ బెదిరించరాదని కూడా స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో కూడా అప్పటి సీఐ నాగరాజు ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. ఆ ఉదంతంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.  

ఫిర్యాదు ఉపసంహరణకు బెదిరింపులు 
తన ఆత్మహత్యకు సీఐ నాగరాజు కారణమంటూ ఈ ఏడాది మే 21న  క్రాంతికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ  ‘దర్యాప్తు విషయంలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుకు ఇస్తున్న ప్రాధాన్యతను దళిత యువకుడైన క్రాంతికుమార్‌ కేసుకు ఇవ్వడంలేదు.  పైగా కుమారుడి మృతిపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు రోజూ పిటిషనర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీని వెనుక విజయవాడ నార్త్‌ జోన్‌ ఏసీపీ ఉన్నారు.  ప్రైవేటు గూండాలు కూడా ఇంటికి వస్తూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి’ అని విన్నవించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement