51 మందిపై రౌడీషీట్లకు బ్రేక్‌! | Chandrababu government backtracks on rowdy sheets against YSRCP leaders | Sakshi
Sakshi News home page

51 మందిపై రౌడీషీట్లకు బ్రేక్‌!

Sep 24 2026 5:32 AM | Updated on Sep 24 2026 5:32 AM

Chandrababu government backtracks on rowdy sheets against YSRCP leaders

వైఎస్సార్‌సీపీ నేతలపై ‘రౌడీ’ ముద్రకు చంద్రబాబు సర్కారు వెనుకడుగు 

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని నివేదించిన నిఘా వర్గాలు 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతలపై ‘రౌడీ’ ముద్ర వేయాలన్న చంద్రబాబు సర్కారు దుందుడుకు చర్యలకు బ్రేక్‌ పడింది. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు రౌడీ షీట్లు తెరిచే స్థాయికి దిగజారిపోయిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 24 గంటలు తిరక్కముందే వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఐదేళ్ల క్రితం నాటి కేసులో ఉన్నారనే సాకు చూపి 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు మంగళవారం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయొద్దని బుధవారం రాత్రి పోలీస్‌ హౌస్‌ ఆఫీసర్లకు సెల్‌ మెసేజ్‌లు ఇవ్వడం పోలీస్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేయాలని, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ఉవ్వెత్తున ఉద్యమం చేయడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కారు కక్ష సాధింపునకు దిగిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో ఉన్నారనే సాకు చూపి ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తోపాటు 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకత్వాన్ని మొత్తంగా రౌడీల జాబితాలోకి నెట్టే ఇలాంటి బరితెగింపు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోరు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న వేళ, సమాధానం చెప్పలేక చేతులెత్తేసి.. ఐదేళ్ల నాటి కేసును తవి్వతీసి మరీ ఈ అ్రస్తాన్ని ప్రయోగించిన ప్రభుత్వం అభాసు పాలైంది. 

హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇ చ్చిన వారిని, పోలీసులే అరెస్టు అవసరం లేదని నోటీసులతో వదిలేసిన వారిని సైతం ఇప్పుడు రౌడీలుగా చిత్రీకరించేందుకు సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు తెరిచే చర్యలు ఆపాలంటూ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు కమిషనరేట్‌ పరిధిలోని తొమ్మిది పోలీస్‌ స్టేషన్లకు చెందిన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు, నలుగురు ఏసీపీలకు సెల్‌ మెసేజ్‌లు ఇవ్వడం గమనార్హం. దీంతో భవానీపురం, అజిత్‌సింగ్‌నగర్, నున్న, కృష్ణలంక, మాచవరం, పటమట, గవర్నర్‌పేట, గుణదల, సత్యనారాయణపురం స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని వారిపై రౌడీషీట్లు తెరిచే చర్యలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలుపుదల చేయాలని సీపీ సెల్‌ మెస్‌జ్‌ ద్వారా స్పష్టం చేశారు.   

జగన్‌ గవర్నర్‌ను కలిశాకే..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ కీలక నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసిన అనంతరం రౌడీ షీట్లు విషయంలో ప్రభుత్వం యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్ష నేతలపై రౌడీషీట్లు తెరిచేందుకు చంద్రబాబు పూనుకోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని నిఘా వర్గాల నివేదికలతో వెనుకడుగు వేశారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి.  

న్యాయపరంగా నిలవదనే భయం  
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లోకేశ్‌ ఒత్తిడితో రెడ్‌బుక్‌ అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిందే తడవుగా 2024లోనే మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడితో సంబంధం లేని వారిపై పలు సెక్షన్లతో కేసులు పెట్టి అరెస్టులు చేసేలా లోకేశ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ ఉద్యమం ఉధృతం చేయడంతో ఉలికిపాటుకు గురైన చంద్రబాబు రౌడీషీట్ల తంతుకు తెరలేపారు. ఒకే కేసులో ఏకంగా 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు తెరిస్తే సమాజం హర్షించదని, న్యాయపరంగాను అవి నిలబడవనే భయంతో పునరాలోచనలో పడినట్టు తెలిసింది.  

ఇష్టానుసారం రౌడీషీట్‌ తెరవడం కుదరదు  
రౌడీషీట్‌ అనేది సాధారణ పోలీసు రికార్డు కాదు. రెండు కంటే అత్యధిక కేసులు ఉన్నవారిపైన, సమాజంలో ఇబ్బందికరంగా ఉన్న వారిపైన పోలీసుల నిఘా కోసం రౌడీషీట్‌ తెరుస్తారు. ఏపీ పోలీస్‌ మాన్యువల్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌ 601 ప్రకారం తరచూ నేరాలకు పాల్పడే వారిపై, శాంతిభద్రతలకు ముప్పుగా వ్యవహరించే వారిపై రౌడీషీట్‌ తెరవడానికి నిబంధనలు వర్తిస్తాయి. ఒక్క కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన రౌడీషీట్‌ తెరవడం సరికాదని ఏపీ హైకోర్టు సైతం పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. రౌడీషీట్‌.. వ్యక్తి ప్రతిష్ట, హక్కులపై ప్రభావం చూపే చర్య కాబట్టి పోలీసు మాన్యువల్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హైకోర్టు పేర్కొన్న సందర్భాలున్నాయి. 

రౌడీషీట్‌ అనేది గ్రామాల్లో అయితే డీఎస్పీ పర్యవేక్షణలో, పట్టణాల్లో ఏసీపీల పర్యవేక్షణలో చేయాల్సిన ప్రక్రియ. రౌడీషీట్‌ తెరవాలన్నా, తొలగించాలన్నా.. ఆయా వ్యక్తుల ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అటువంటిది రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏకంగా 51 మందిపై ఒకేసారి రౌడీషీట్లు తెరవాలనే ప్రయత్నం తొందరపాటు చర్య అవుతుందని రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులు సైతం తప్పుబడుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement