ఉత్తరాంధ్ర అతలాకుతలం | Moderate to heavy rains in South Coast and Rayalaseema | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర అతలాకుతలం

Sep 24 2026 5:26 AM | Updated on Sep 24 2026 5:26 AM

Moderate to heavy rains in South Coast and Rayalaseema

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు వద్ద నీట మునిగిన వరి పంట పొలాలను చూపిస్తున్న రైతు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు

కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన వాయుగుండం

పొంగుతున్న వాగులు, గెడ్డలు.. ఉధృతంగా వంశధార, నాగావళి, బహుద నదులు

జనజీవనం అస్తవ్యస్తం.. పలుచోట్ల కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

పొలాల్లోకి నీరు చేరడంతో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం

24 గంటల్లో పలాసలో 14సెం.మీ వర్షపాతం

పార్వతీపురం మన్యం జిల్లాలో వరద ఉధృతికి యువకుడు గల్లంతు

తీవ్ర వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ 

దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తోంది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బుధవారం సాయంత్రానికి కళింగపట్నానికి 30 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 90 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అర్ధరాత్రి విశాఖపట్నం–గోపాల్‌పూర్‌ మధ్య కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు వచ్చేశారు. తీరప్రాంతంలోని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. చెరువులు, వాగులు, గెడ్డలు పొంగి ప్రవహించడంతో పలు చోట్ల గండ్లు పడ్డాయి. వంశధార, నాగావళి, బహుద నదులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు (24 గంటల్లో) శ్రీకాకుళం జిల్లా పలాసలో 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 10, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 9.7, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 9.4, పోలవరం జిల్లా కూనవరంలో 9.1, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో 8.9, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 8, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. బుధవారంనాడు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 8.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా లక్ష్మీనర్సుపేటలో 7.3, ఎన్టీఆర్‌ జిల్లా పుట్రేలలో 6.7, రెడ్డిగూడెంలో 6.4, ఎ.కొండూరులో 6.2, ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 5.7, కృష్ణా జిల్లా పెదయెరుకపాడులో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం..
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు తదితర జిల్లాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి.  వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. విశాఖపట్నం ముడసర్లోవలో గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాంతంలో ప్రహరీ కూలింది. శ్రీకాకుళం జిల్లాలో గెడ్డలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. నందిగాం మండలంలో కొత్తగ్రహారం– జడ్యాడ వంతెన కూలిపోయింది. 

పలాస తదితర ప్రాంతాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లుతుండగా, లోతట్టు రహదారులపైకి వర్షపు నీరు చేరింది. జిల్లాలో 1,222 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నా, అంతకు రెండింతలు ముంపునకు గురై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం ఏగోటివలస వద్ద తోటపల్లి కాలువలో స్నానానికి వెళ్లిన యువకుడు వరద ఉధృతిలో గల్లంతయ్యాడు. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం నల్లమిల్లి, జనుపల్లితో పాటు ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, మామిడికుదురు, మలికిపురం మండలాల్లోని వరి చేలల్లో నాలుగడుగుల ఎత్తున నీరు చేరింది. దీంతో, రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా కోడుమూరులో 6.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోడుమూరు మండలంలోని లద్దగిరి, గోరంట్ల హంద్రీకి వరద నీరు భారీగా వచ్చింది. నంద్యాల జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

గాలుల ధాటికి వణికిన చింతలపాడు
ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం చింతలపాడు గ్రామం భారీ గాలులకు వణికిపోయింది. ఐదు నిమిషాల్లో ఈదురు గాలులు గ్రామాన్ని కకావికలం చేశాయి. గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. రేకులు ఎగిరి వీధుల్లో పడటంతో ఐదుగురు గాయపడ్డారు. గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ గడిపారు.

నేడు కూడా భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement