రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల దుర్మరణం | Four students dead in train collision | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల దుర్మరణం

Sep 24 2026 4:49 AM | Updated on Sep 24 2026 4:49 AM

Four students dead in train collision

మరొకరి పరిస్థితి విషమం 

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఘటన

టెక్కలి/సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో నౌపడ–గుణుపూర్‌ రైలు మార్గంలో బుధవారం రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన జన్నీ దిలీప్‌కుమార్‌ (17), గంగువాడ విశాఖరావు  (17), భీంపురం గ్రామా­నికి చెందిన జన్నీ శరత్‌కుమార్‌ (17), మెళియాపుట్టికి చెందిన సవర శివ (17)తో పాటు డమర గ్రామానికి చెందిన గంగువాడ సాల్మన్‌రాజు టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్నారు. తుపాను నేపథ్యంలో బుధవారం కళాశాలకు సెలవు ప్రకటించడంతోఅందరూ బయటకు వెళ్లారు. రావివలస సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా నౌపడ నుంచి గుణుపూర్‌ వైపు వస్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో దిలీప్‌కుమార్, శరత్‌కుమార్, విశాఖరావు, శివ అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఉన్న మరో విద్యార్థి సాల్మన్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన వారంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారే. టెక్కలిలో గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటున్నారు. సమాచారం అందుకున్న టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహశీల్దార్‌ రాంబాబు, సీఐ విజయకుమార్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ప్రమాద ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన సాల్మన్‌ రాజును టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
నలుగురు విద్యార్థుల మృతి అత్యంత విషాదకరం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావివలస సమీపంలో రైలు ఢీకొనడంతో గిరిజన విద్యార్థులు విశాఖరావు, దిలీప్‌కుమార్, శివ, శరత్‌కుమార్‌ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి సాల్మన్‌రాజుకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అతను త్వరగా కోలుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయం అందించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement