సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటిన వేళ వర్షాలు మరింత జోరందుకున్నాయి. సముద్ర తీర ప్రాంతం పొడవునా గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సోమవారం నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. అక్కడకక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చెరువులు, వాగులు, గెడ్డలు పొంగి ప్రవహించడంతో పలు చోట్ల గండ్లు ఏర్పడ్డాయి. వరద నీరు ప్రవహించడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల కోతకు గురయ్యాయి. మరికొన్నిచోట్ల కల్వర్టులు కూలిపోయాయి. ఎగువన, జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వంశధార, నాగావళి, బాహుద నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
ఉద్దానంపై ఎక్కువ ప్రభావం..
ఉద్దానంపైలోని సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి మండలాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వరద నీరు పొంగి ప్రవహించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పంట భూములు జలదిగ్బంధమయ్యాయి. సారవకోట, జలుమూరు, టెక్కలి, పోలాకి మండలాల్లో కూడా ప్రభావం చూపించింది. అత్యధికంగా పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, కవిటి, పోలాకి, జలుమూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి 1222 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నా..అంతకు రెండింతలు ముంపునకు గురై ఉండొచ్చని అంచనా. కరువుతో అసలే అంతంత సాగు చేసిన తరుణంలో తాజా వర్షాలతో పంటలు ముంపునకు గురికావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జలదిగ్బంధం..
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు వచ్చిచేరింది. వంతెనలు, కల్వర్టులపై భారీగా వరద నీరు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా చేరుతున్న వరదనీరు నదీ తీర ప్రాంతం పొడవునా వణికిస్తోంది.చెరువులు, వాగులకు గండ్లు పడటంతో రోడ్లపైకి వరద నీరు చేరడంతో ప్రయాణాలకు ఇబ్బందికరంగా పరిణమించాయి. కొన్ని చోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
నీట మునిగిన పంట పొలాలు
పొంగి ప్రవహించిన వాగులు, గెడ్డలు
దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు
మండలం పలాస వజ్రపుకొత్తూరు టెక్కలి సంతబొమ్మాళి కోటబొమ్మాళి నరసన్నపేట పోలాకి సరుబుజ్జిలి పాతపట్నం నందిగాం బూర్జ సోంపేట గార శ్రీకాకుళం కవిటి
మి.మి.లలో 45.8 73.4 34.8 31.8 36.6 48.4 31.4 15.8 31.8 44.6 30.4 33.6 28.0 36.2 22.8
ఆమదాలవలస జలుమూరు మెళియాపుట్టి పొందూరు లావేరు ఎల్‌ఎన్ పేట కంచిలి హిరమండలం ఎచ్చెర్ల రణస్థలం కొత్తూరు మందస ఇచ్ఛాపురం జి.సిగడాం సారవకోట
22.2 47.6 21.4 34.6 23.0 67.6 35.2 63.4 40.2 31.0 7.4 47.4 23.0 27.0 49.6
ముంపుబారిన పంట పొలాలు
సంతబొమ్మాళి: తుఫాన్ ప్రభావంతో సంతబొమ్మాళి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కొల్లిపాడు, మరువాడ, లక్కివలస, మేఘవరం, నౌపడ, పోతనాయుడుపేట, వడ్డీతాండ్ర తదితర గ్రామాల్లోని పొలాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాశీపురం గ్రామానికి వెళ్లే రహదారిపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెలగపేట వద్ద చెట్టుకొమ్మలు విద్యుత్ లైన్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు గంటల తరబడి అంతరాయం కలిగింది. తుఫాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పునరావాస కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో కష్ణమూర్తి, తహసీల్ధార్ హేమసుందరరావు, ఆర్‌ఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


