వానొస్తే వణుకే! | - | Sakshi
Sakshi News home page

వానొస్తే వణుకే!

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

క్షరాలు నేర్వాల్సిన చోట అభద్రతా రాజ్యమేలుతోంది. ఉన్నత చదువుల కోసమని విశ్వ విద్యాలయానికి వస్తే.. వానొస్తే చాలు భయం గుప్పెట్లో గడపాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. కోట్ల రూపాయల బడ్జెట్‌, అధునాతన భవనాలు అందుబాటులో ఉన్నాయని పాలకులు చెబుతున్నా కొద్దిపాటి వర్షానికే పైకప్పులు లీకవుతుండడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. జిల్లాలో అత్యున్నత విద్యా సంస్థగా పేరొందిన ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ హాస్టల్స్‌లో దారుణమైన పరిస్థితి నెలకొంది. మూడు రోజులగా కురుస్తున్న వర్షాలకు భవనాలు లీకవుతుండటంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. పైకప్పుల నుంచి నిరంతరాయంగా నీరు కారుతుండటంతో గదులన్నీ జలమయమవుతున్నాయి. విలువైన సర్టిఫికెట్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతరత్రా తడిసి ముద్దవుతున్నాయి. కనీసం నిద్రపోవడానికి, కూర్చోవడానికి పొడి స్థలం లేక విద్యార్థులు జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువులపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థులు వర్షం వస్తే గదుల్లో నీటిని బయటకు తోడుకునే పనిలో ఉండాల్సి వస్తోంది. భవనాల గోడలు, పైకప్పులు నానిపోవడంతో విద్యుత్‌ బోర్డుల ద్వారా షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

విద్యార్థుల భద్రత గాలికి..

విద్యార్థుల భద్రత దృష్ట్యా హాస్టల్స్‌ భవనాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు చక్కదిద్దాలి. పైకప్పులకు నాణ్యమైన వాటర్‌ ప్రూపింగ్‌ పనులు చేపట్టాలి. గోడల పగుళ్లను పుట్టితో పూడ్చివేయాలి. హాస్టల్‌ భవనాల ఆధునీకరణ, మరమ్మతులు చేపట్టాలి. లీకేజీలు ఎక్కువగా ఉన్న గదుల్లోని విద్యార్థులను తక్షణమే క్యాంపస్‌లోని ఇతర సురక్షితమైన భవనాల్లోకి మార్చాలి. కానీ ఆ దిశగా వర్సిటీ అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు కళ్లముందే లీకవుతున్నా పాలకులకు, వర్సిటీ అధికారులు పట్టింపు లేకుండా పోయింది. ప్రమాదం జరిగి, మూల్యం చెల్లించాక అప్రమత్తం కావడం కంటే ముందే జాగ్రత్తగా వ్యవహరించాలన్న ఆలోచన అధికారులకు, ప్రభుత్వానికి లేదు. విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకునే హక్కు ఉన్నప్పుడు.. వారికి కనీసం సురక్షితమైన గది, లీకేజీ లేని పైకప్పు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి, వర్సిటీ అధికారులకు లేదా అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంబేడ్కర్‌ యూనివర్సిటీ హాస్టల్‌ గదిలోకి

చేరిన వర్షపు నీరు

పైకప్పు నుంచి లీకవుతున్న నీరు

అంబేడ్కర్‌ వర్సిటీ హాస్టళ్లలో లీకులు

వర్షపు నీరు కారుతున్న పైకప్పులు

తడిచి ముద్దవుతున్న పుస్తకాలు, దుస్తులు

ఆందోళనలో విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement