ఆమదాలవలస: పట్టణంలో ఆత్మహత్యకు సిద్ధపడిన ఒక ప్రేమజంటను శక్తిటీమ్ పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. బుధవారం పట్టణంలో ఒక దుకాణం వద్ద అనుమానాస్పద రీతిలో కూర్చొని ఉన్న వీరిద్దరిని స్థానికులు గమనించి ఆమదాలవలస సర్కిల్ శక్తిటీమ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన శక్తి టీమ్ ఉమెన్ హెడ్ కానిస్టేబుల్స్ తమ్మినేని అమ్మాజీ, లక్ష్మణరావులు అక్కడికి చేరుకొని వారిని విచారించారు. ఆ సమయంలో వారి వద్దనున్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాలోని గజపతి జిల్లా రాయగడ మండలానికి చెందిన యవతి, మన్యం జిల్లా కొత్తూరు మండలం రాయల గ్రామానికి చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో కొద్దిరోజుల క్రితం ఇళ్లనుంచి పారిపోయి వచ్చారు. అయితే తమ వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ జంటను స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి, తగిన కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను రప్పించి వారికి క్షేమంగా అప్పగించారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన శక్తిటీమ్ సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు.


