డీఎస్సీ స్కామ్, వైఎస్సార్‌సీపీ నేతలపైన దాడుల గురించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే
చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు
శాంతియుతంగా ర్యాలీ చేస్తే అక్రమ కేసులు పెడతారా?
శాప్ ఆఫీస్ వద్ద దాడిపై అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం
అసలు జరగని క్రీడా పోటీలకు సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?
పోటీలు జరగలేదని సంబంధిత క్రీడా సంఘాలే చెప్పినప్పుడు శాప్ వాటిని ఎలా ఆమోదించింది?
ఆ నకిలీ, అనుమానాస్పద సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు?
ఇలాంటి స్కామ్ ఎక్కడా జరిగి ఉండదు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 స్కామ్‌పై సీబీఐతో విచారించాలని, ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసనలు, ర్యాలీలు చేసే హక్కు లేదా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే.. రౌడీషీట్‌లు తెరుస్తారా? శాంతియుతంగా ర్యాలీలు చేస్తే అక్రమ కేసులు పెడతారా?’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన శాప్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించిన వారిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్సీ–2025 పేరిట జరిగిన స్కామ్ గురించి సాక్ష్యాలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏ విధంగా డీఎస్సీ స్కామ్‌లో యువత నష్టపోయిందో వివరించారు. ఈ వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవ స్థపై ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. 
డీఎస్సీ కుంభకోణం, టీడీపీ నేతల గూండాగిరీ, దౌర్జన్యాల గురించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వివరిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఇది దేశ చరిత్రలో ఎన్నడూ జరగని స్కామ్
‘ఇప్పటికే డీఎస్సీ–2025 అక్రమాలకు సంబంధించి పార్ట్–1, పార్ట్–2 అంటూ ప్రెస్‌మీట్‌లు పెట్టి.. జరిగిన ప్రతి తప్పును సాక్ష్యాలు, ఆధారాలతో ఇప్పటికే ప్రజల ముందు పెట్టాం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, నాలుగు పాయింట్ల ఆధారంగా డీఎస్సీ–2025లో అక్రమాలు చోటు చేసుకున్నాయి.
1.ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండూ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు అప్పగించడంతో ఈ స్కామ్ ప్రారంభమైంది.
2. ఈ ప్రక్రియ మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అవుట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. అతని పేరు తొలుత మెరిట్ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత తొలగించారు. అతడి లాగిన్ ఐడీ బ్లాక్ చేశారు. కాల్ లెటర్ కూడా పంప లేదు. దీంతో అతడు ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాకుండా, కోర్టుకు కూడా వెళ్లాడు. అంటే ఒక స్కామ్‌ను కప్పిపుచ్చేందుకు (కవరప్) ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అగచాట్లు పడిందో తేట తెల్లమైంది. లీకేజీ వ్యవహారం బట్టబయలైంది.
3. స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీవోలు ఇవ్వడం చూశాం. గతంలో ఉన్న జీవోలు రద్దు చేసి కొత్తగా జీవో నంబర్ 4, 47 అని చెప్పి రెండు కొత్త జీవోలు తెచ్చి, వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా 372 ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామక ప్రక్రియ పూర్తి కాగానే జీవో నంబర్ 23, 25, 56 అంటూ మరో 3 జీవోలు తెచ్చారు. దాని ప్రకారం మళ్లీ పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారు. మరి పరీక్ష రాయకుండా 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు.
4. ఫేక్ సర్టిఫికెట్లు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ ఏరకంగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడో చూశాం. జరగని గేమ్స్ జరిగినట్లు చూపారు. ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడైన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. దాదాపు 38 ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇచ్చారనేది కూడా చెప్పాం. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాల్లో సెక్రటరీలకు, వారి భార్యలకు, కుటుంబ సభ్యులకు ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విషయాన్ని కూడా చెప్పాం. అసలు జరగని క్రీడా పోటీలకు సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? పోటీలు జరగలేదని సంబంధిత క్రీడా సంఘాలే చెప్పినప్పుడు శాప్ వాటిని ఎలా ఆమోదించింది? ఆ నకిలీ, అనుమానాస్పద సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు? టెట్ అర్హత లేని వారికి టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు? ఒక కేటగిరీలో పొందిన టెట్ మార్కులను మరో కేటగిరీ నియామకానికి ఎలా ఉపయోగించారు? గతంలో వేరే సామాజికవర్గంలో నమోదు చేసుకున్నవారికి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎలా ఉద్యోగాలు ఇచ్చారు? ప్రభుత్వం ‘ఏడుసార్లు వెరిఫికేషన్ చేశాం’ అంటుంటే, ఇన్ని తీవ్రమైన అక్రమాలు ఏడు దశల్లోనూ ఎలా కనిపించలేదు?
అసెంబ్లీలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు
డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి బేరసారాలపై ఆడియో, వీడియో బయటకు వచ్చింది. ఈ ఫోన్ సంభాషణపై పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో చూశాం. అందులో స్పష్టంగా (క్లియర్‌గా) ఫోన్ నెంబర్ కనిపిస్తున్నా, ఆ వ్యక్తి గురించి ఎఫ్‌ఐఆర్‌లో రాయలేదు. కేవలం అనుమానాస్పదం (సస్పెక్ట్) అని మాత్రమే రాశారు. అరెస్టు కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయినా సీఎం చంద్రబాబు మాత్రం ఆ వ్యక్తిని అరెస్ట్ చేశాం.. రిమాండ్‌కు పంపించాం.. అంటూ అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చూశాం.
శాప్ ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల దాడి
డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ సెప్టెంబర్ 21న శాప్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముందుగానే సమాచారం ఇచ్చారు. అనుమతి కోరుతూ కమిషనర్‌కు లెటర్ కూడా రాశాడు. కానీ, ఆరోజు ఏం జరిగింది? అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎలా కుట్ర చేశారో చూశాం. టీచర్లు కాని టీచర్లను పిలిపించి, శాంతియుత ర్యాలీకి సమాంతరంగా ధర్నా చేయించారు. నిజానికి వారు చదువు చెప్పే గురువులు కాదు. దొంగ సర్టిఫికెట్లతో, ఏ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు పొందిన ఈ టీచర్లు కానీ టీచర్లను పిలిపించి, శాప్ కార్యాలయం ఎదుట కావాలనే గొడవ చేయించారు. అంతే కాకుండా టీడీపీ గూండాలను అక్కడికి రప్పించారు. వారంతా కలిసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై దారుణంగా దాడి చేశారు. అసలు వారంతా ఎవరో చూడండి. వీరు గతంలో సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వారే. (ఫొటోలు మీడియాకు చూపారు).
దాడి చేసిన వారిని వదిలేసి రివర్స్ కేసులు
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై టీడీపీ గూండాలు దారుణంగా దాడి చేసినా, వారిపై ఎలాంటి చర్యలు లేవు. వారిపై కేసులు నమోదు చేయలేదు. అందుకు పూర్తి భిన్నంగా, రివర్స్‌లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై కేసు పెట్టారు. ఎంత దారుణంగా ఆ కేసులు పెట్టారంటే.. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు పెట్టారు. ఇప్పటికే 350 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ జాబితా ఇంకా పెరుగుతోందని చెప్పారు. ఇలా కేసులు పెట్టడం, రాత్రి పూట వారి ఇళ్లల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేయడం.. ఆపై రాత్రి వేళల్లో అరెస్టులు చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు.. కోర్టులు వాటిని తప్పు పడుతున్నాయి. మేజిస్ట్రేట్.. వీళ్లు చేస్తున్న అన్యాయాలను తిట్టి ఇలా చేయడం ధర్మం కాదంటూ వాళ్లకు బెయిల్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో మనిషి అనే వాడు బతకగలిగే అవకాశం కోర్టుల పుణ్యమాని కలుగుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమనేది ఏ స్థాయిలో అమలవుతుందో.. ఏ రకంగా విధ్వంసం జరుగుతున్నదో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. 
గవర్నర్‌ను కలిసిన అనంతరం లోక్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రౌడీషీట్‌లు తెరిచి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తారా?
శాప్ కార్యాలయం ఎదుటæ శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. వాటిపైనా కోర్టులు స్పందించాయి. శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే, రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారని నిలదీశాయి. ప్రశ్నిస్తే రౌడీషీట్‌లు ఓపెన్‌చేసి వాళ్ల భవిష్యత్ (కెరియర్)ను నాశనం చేస్తారా? తప్పు చేసింది మీరు. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా ర్యాలీలు, నిరసనలు చేసే హక్కు లేదా? ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తారా? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? మా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇందులో న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుంది. ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాల్సిందే. తప్పు ఒప్పుకొని విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. కనీసం అప్పుడైనా మన రాష్ట్రంలో పిల్లలకు, నిరుద్యోగులకు పరీక్షల మీద విశ్వాసం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో మా డిమాండ్ కొనసాగుతోంది. ఈ యుద్ధం కచ్చితంగా కొనసాగుతుంది.
ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉషశ్రీ చరణ్, పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తాటిపర్తి చంద్రశేఖర్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాజగొల్ల్ల రమేష్ యాదవ్, వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, కొరముట్ల శ్రీనివాసులు, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ గవర్నర్‌ను కలిసి డీఎస్సీ స్కామ్ గురించి వివరించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ
విజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటివని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. డీఎస్సీ స్కామ్‌పై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏ రకంగా చంద్రబాబు ప్రభుత్వం పిల్లలను వాడుకుంటూ, వారితో గంజాయి అమ్మిస్తూ, వారితో చట్ట విరుద్ధమైన పనులు చేయించిందో.. ఇందులో పోలీసులు ఎలా పని చేశారు.. ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగం చేస్తోంది అనే దానికి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిదర్శనం. ఈ కేసులో బుధవారం సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా మందలిస్తూ.. సీపీ, డీజీపీ పేర్లను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని నిలదీయడం చూస్తుంటే.. ఇది నిజంగా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే. వీళ్లే ఆ పిల్లాడిని అరెస్టు చేసి తీసుకొస్తారు. వీళ్లే కొట్టి చంపేస్తారు. చివరకు శవం కూడా మాయం చేస్తారు. మాయం చేయడమే కాకుండా ఆ పిల్లాడ్ని రౌడీగా చిత్రీకరిస్తూ బ్రాండింగ్ చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో ఈ ఘటన ద్వారా తేటతెల్లం అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో నగరం నడి»ొడ్డున ఏ విధంగా దారుణాలు జరుగుతున్నాయో స్పష్టం అవుతోంది’ అని వైఎస్ జగన్ అన్నారు.


