వైద్య వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఆశావహుల జాబితా
మరో వైపు రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధి ఫ్రెండ్
రాయలసీమ వైపు పోస్టులు పేరిట వైద్యులతో ‘డీల్’
ఇదే బాటలో కీలక ప్రజాప్రతినిధి పీఏలు
సమన్వయకర్తల పోస్టింగుల్లో చక్రం తిప్పుతున్న కీలక ప్రజాప్రతినిధి
ఒక్కో పోస్టుకు రూ.20 లక్షల వరకు డిమాండ్
ఆరోగ్యశ్రీ పథకంలో మరో అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పథకాన్ని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తల పోస్టింగ్‌లకు సంబంధించి కీలక ప్రజాప్రతినిధి ఒకరు వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఒకటి బయటకు రావడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
జిల్లా సమన్వయకర్తలను మార్చడం కోసం కొద్ది రోజులుగా ఆ ప్రజాప్రతినిధి కార్యాలయంలో కసరత్తు జరుగుతోంది. దీనికి జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు, కీలక ప్రజాప్రతినిధి బేరసారాలకు దిగినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు కీలక ప్రజాప్రతినిధి కార్యాలయం సిద్ధం చేసిన ఆశావహుల జాబితాతో కూడిన పీడీఎఫ్ ఫైల్ ప్రస్తుతం వైద్య వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. – సాక్షి, అమరావతి
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైగా
ఆరోగ్యశ్రీ సమన్వయకర్తల నియామకాల్లో పెద్ద ఎత్తున బేరసారాలు నడుస్తున్నాయని వెల్లడవుతోంది. ఒక్కో జిల్లా సమన్వయకర్త పోస్టింగ్‌కు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకుపైగా కీలక ప్రజాప్రతినిధి ఆశిస్తున్నారని వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన అనుయాయులు వైద్యులతో డీల్ మాట్లాడుతున్నారని తెలిసింది.
ఈ క్రమంలో ప్రజాప్రతినిధి స్నేహితుడు, గతంలో రాయలసీమలో టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలైన నాయకుడు పలు జిల్లాల్లో సమన్వయకర్తల పోస్టింగ్‌లు ఇప్పించేలా వైద్యులతో ఒప్పందం చేసుకున్నారు. వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూల్, సత్యసాయి, అనంతపురం, గుంటూరు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, వైజాగ్ మరికొన్ని జిల్లాల సమన్వయకర్తల పోస్టింగ్‌లు ఇప్పించేలా వైద్యులతో డీల్ కుదుర్చుకున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధి పీఏలు కూడా ఇదేవిధంగా డీల్ కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ట్రస్ట్ అధికారుల వేధింపులు
ఇదిలా ఉండగా ఇప్పటికే జిల్లాల్లో పనిచేస్తున్న సమన్వయకర్తలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని కొందరు అధికారులు డబ్బు కోసం వేధిస్తున్నారు. కొద్ది రోజుల కిందట పలు జిల్లాల సమన్వయకర్తలకు టార్గెట్‌లు ఇచ్చి వసూళ్లకు తెరలేపినట్టు వెల్లడైంది. మరో వైపు మీపై విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదులు అంటూ ట్రస్ట్ నుంచి కొందరు సమన్వయకర్తలకు ఫోన్‌లు చేసి డబ్బు డిమాండ్ చేసినట్టు సమాచారం. వాస్తవానికి ట్రస్ట్‌లో విజిలెన్స్ కమిటీనే లేదు. ఇది ఆరోగ్యశ్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


