తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలో ఏర్పాటు
ప్రభుత్వ ప్రచారం కోసం సోషల్ మీడియా పాలసీ
వ్యూస్ ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నగదు చెల్లింపు
సహకార చక్కెర ఫ్యాక్టరీలు శాశ్వతంగా మూత
దీర్ఘకాలానికి సోలార్ విద్యుత్ కొనుగోలు
యూనిట్ 3.75 పైసల చొప్పున సెకీతో ఒప్పందం
జిల్లాల్లో టీడీపీ ఆఫీసులకు కేటాయించిన భూముల లీజు 99 ఏళ్లకు పెంపు
ఎస్‌ఐపీబీ, సీఆర్‌డీఏ నిర్ణయాలకు ఆమోదం
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు.. ప్రభుత్వ ప్రచారం కోసం సోషల్ మీడియా పాలసీ.. సహకార చక్కెర ఫ్యాక్టరీలు శాశ్వతంగా మూత.. సెకీ నుంచి దీర్ఘకాలం పాటు సోలార్ విద్యుత్ కొనుగోలు.. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు కేటాయించిన ప్రభుత్వ భూముల లీజును 33 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాలకు ఆ తర్వాత 99 ఏళ్లకు పెంచుతూ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు..
» శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాల్లో నాలుగు కొత్త పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు. ప్రతీ కమిషనరేట్‌కు ఐజీపీ, డీఐజీపీ స్థాయి అధికారి కమిషనర్ ఆఫ్ పోలీసుగా వ్యవహరిస్తారు.
» రాష్ట్రంలో ప్రభుత్వ సమాచారాన్ని, ప్రజా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు విశ్వసనీయమైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, వారిని ఎంప్యానెల్ చేసే విధంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీకి ఆమోదం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యం. అధికారిక సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీరిని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎంప్యానెల్ చేయనున్నారు. ఈ విధానం ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు వర్తిస్తుంది. ప్రారంభ ఎంప్యానెల్‌మెంట్ ఒక సంవత్సరం ఉంటుంది. సంతృప్తికరమైన పనితీరు ఆధారంగా అధికార సంస్థ నిర్ణయంతో మరో రెండేళ్ల వరకు, ఒక్కోసారి ఒక సంవత్సరం చొప్పున పొడిగించవచ్చు. ఉదా.. ఒక లక్ష వ్యూస్‌కు రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
» పనిచేయని మూడు సహకార చక్కెర ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసేస్తూ, అందులోని ఉద్యోగులకు వీఆర్‌ఎస్ వర్తింపజేసేందుకు లిక్విడేషన్ చేయడానికి జాయింట్ కలెక్టర్లను లిక్విడేటర్లుగా నియామకం. అలాగే, ఐదు సహకార చక్కెర కర్మాగారాల పెండింగ్ బకాయిలు, ఉద్యోగుల వీఆర్‌ఎస్ ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల కోసం ఏపీఐఐసీ నుంచి రూ.66.57 కోట్ల రుణం పొందేందుకు ఆమోదం. నష్టాల్లో ఉన్న ఎనిమిది సహకార చక్కెర కర్మాగారాల బకాయిల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను అమలుచేయడానికి ఆమోదం.
» రాష్ట్ర డిస్కంల తరఫున ఏపీపీసీసీ ద్వారా విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు ఆమోదం. ఇందులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ) నుంచి 1,344 మోగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 40 సంవత్సరాల కాలానికి.. అలాగే అర్హత కలిగిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి 500 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యాన్ని పోటీ బిడ్డింగ్ విధానంలో యూనిట్ రూ.3.75 చొప్పున నాలుగు సంవత్సరాల కాలానికి సమకూర్చుకోవడానికి ఆమోదం.
» వివిధ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఇచ్చిన ప్రభుత్వ భూముల లీజు కాలాన్ని 33 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాలకు పొడిగింపు. ఆ తరువాత 99 ఏళ్లకు పొడిగింపు.
» న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంపు. ఇది 31.03.2026 నుంచి అమల్లోకి వచ్చేలా ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం.
» హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు–ఫేజ్– ఐఐ కింద పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.125.65 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు ఆమోదం.
» పోలవరం ఎడమ ప్రధాన కాలువలో (ప్యాకేజీ–6) ఉన్న 12 సూపర్ పాసేజీల నిర్మాణ పనులను ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న సుమ ఎన్‌కాన్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్‌కు అప్పగింత.
» స్వర్ణ వార్డుల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులకు ప్రమోషన్ అవకాశాలు కల్పించేందుకు, మిగులు పోస్టులను సరెండర్ చేయడం లేదా ఎంట్రీ లెవల్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రమోషనల్ ఛానళ్లను ఏర్పాటుచేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2019 స్థానంలో ఈ కేటగిరీలన్నింటికీ ప్రత్యేక సర్వీస్ రూల్స్ జారీచేసేందుకు మంత్రి మండలి ఆమోదం.
» డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం, బ్రహ్మసమేథ్యం గ్రామంలో 1,618 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించేందుకు ఆమోదం. శ్రీకాకుళం నుంచి భీమునిపట్నం వరకు ప్రతిపాదిత బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమి బ్యాంకు ఏర్పాటు.
» పట్టణాభివృద్ధి సంస్థలన్నింటిలోనూ ల్యాండ్ పూలింగ్ విధానం అమలుచేసే ప్రతిపాదనలపై కేబినెట్ చర్చ. అయితే, కొన్ని మార్పులు చేసి వచ్చే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని అధికారులకు ఆదేశం.
» ఇటీవల జరిగిన ఎస్‌ఐపీబీ, సీఆర్‌డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం.


