సాక్షి, అనకాపల్లి: మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి మృతి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీలోని పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంలోని తన స్వగ్రామంలో నిన్న ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం.కుటుంబ సభ్యులు గుర్తించి రవితేజను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రవితేజకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనపై పరవాడ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం రవితేజకు ఆస్పత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి మృతి ఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రవితేజ ఆత్మహత్యాయత్నానికి కారణాలు, అతడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఓయో రూమ్‌లో ఏం జరిగింది?
విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖిత టోప్నో మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్, రోడ్ నంబర్ 5లో ఉన్న ఓయో హోటల్‌కు శ్రీనివాస రవితేజతో కలిసి వెళ్లింది. సెప్టెంబర్ 21న మధ్యాహ్నం హోటల్‌లో రూమ్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున నిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో రవితేజ, హోటల్ సిబ్బంది సహాయంతో ఆమెను కొండాపూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గాయాలు.. రక్తపు మరకలు
యువతి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ గదిని క్లూస్ టీమ్ పరిశీలించగా గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. గదిలో ఖాళీ మద్యం సీసాలు కూడా గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో నిఖిత మృతి అనుమానాస్పదంగా మారింది. ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.
రవితేజ పరార్.. తాజాగా ఆత్మహత్యాయత్నం
నిఖిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించిన వెంటనే శ్రీనివాస రవితేజ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. తాజాగా రవితేజ తన స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈ-మర్రిపాలెంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆస్పత్రికి, అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులకు పరవాడ పోలీసులు తెలియజేశారు.
ఇదీ చదవండి: క్రాంతి కుమార్ హత్యకు కారణమేంటి?


