బీహార్‌లో మళ్లీ వేధింపులు.. ఫామ్‌హౌస్‌లో ఎస్‌ఐ అరాచకం | Bihar Samastipur Incident Video And UP farmhouse News Full Details | Sakshi
Sakshi News home page

బీహార్‌లో మళ్లీ వేధింపులు.. ఫామ్‌హౌస్‌లో ఎస్‌ఐ అరాచకం

Sep 24 2026 10:54 AM | Updated on Sep 24 2026 11:25 AM

Bihar Samastipur Incident Video And UP farmhouse News Full Details

బీహార్‌లో జముయ్‌ ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగుచూసింది. రోడ్డుపై యువతిని చుట్టుముట్టిన యువకులు.. దుర్భాషలు, వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన యువకుడిపైనా దాడికి పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. జముయ్‌లో యువతిపై వేధింపుల వీడియో వైరల్‌ అయిన కొద్ది రోజులకే సమస్తిపూర్‌లో ఇలాంటి మరో ఘటన బయటపడటం కలకలం రేపుతోంది.

బీహార్‌లోని జగత్‌సింగ్‌పూర్‌ గ్రామంలో ఓ యువతి, ఆమెతో ఉన్న యువకుడిని బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు అడ్డగించారు. అనంతరం యువతిని దుర్భాషలాడుతూ, రోడ్డుపైకి నెట్టేస్తూ వేధించినట్లు వీడియోలో కనిపిస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం.. యువతి, యువకుడు గ్రామీణ రహదారిపై ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు బైక్‌లపై అక్కడికి వచ్చి వారిని చుట్టుముట్టారు. యువతిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోను పరిశీలించిన వెంటనే పోలీసులు చర్యలకు దిగారు. ఘటన జరిగిన ప్రాంతం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలను నిర్ధారించే పనిలో ఉన్నామని పోలీసు అధికారి అరవింద్‌ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం బీహార్‌లోని జముయ్‌లోనూ ఇద్దరు పదో తరగతి విద్యార్థులు వేధింపులకు గురయ్యారు. కోచింగ్‌ క్లాసులు ముగించుకుని స్కూటర్‌పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. యువకుడి షర్ట్‌ కాలర్‌ పట్టుకుని అతడిని యువతి నుంచి దూరంగా లాగారు. యువతి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి వెనుక నుంచి ఆమెను పట్టుకున్న దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. ఆ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించి ముగ్గురిని అరెస్టు చేశారు.

మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మతపరమైన ప్రాంతాలను చూపిస్తామంటూ హర్యానాకు చెందిన యువతిని అమ్రోహాకు తీసుకెళ్లి.. ఫామ్‌హౌస్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు యూపీ పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల మేరకు.. ఫతేహాబాద్‌కు చెందిన సుమారు యువతి(24)ని సెప్టెంబర్‌ 20న ఓ మహిళా పరిచయస్తురాలు సంప్రదించి.. అమ్రోహాలోని మతపరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మోహిత్‌ను కలవాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్‌ 21న సోనిపట్‌లో మోహిత్‌ను కలిసిన యువతి.. అతడితో కలిసి మీరట్‌కు వెళ్లగా అక్కడ సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లాలారామ్‌ యాదవ్‌ వారితో చేరినట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 22న ఇద్దరూ కారులో యువతిని హసన్‌పూర్‌కు తీసుకెళ్తూ మార్గమధ్యలో యూపీ పోలీస్‌ ఎస్‌ఐ సంజయ్‌ తోమర్‌ను ఎక్కించుకున్నారు. అనంతరం అట్రాసి-హసన్‌పూర్‌ రహదారిలోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి రెండు గదులు అద్దెకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ అక్కడికి ఆహారం, మద్యం తీసుకొచ్చినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం, తనపై మోహిత్‌, లాలారామ్‌, సంజయ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. తర్వాత ప్రమోద్‌ కూడా గదిలోకి వచ్చి అత్యాచారానికి ప్రయత్నించగా, అతడిని బయటకు నెట్టేసి తలుపు వేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ కోసం వెతికి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది.

సమాచారం అందుకున్న హసన్‌పూర్‌, రాజబ్‌పూర్‌ పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకుని యువతిని రక్షించి.. నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. 
యూపీ ఎస్‌ఐ సంజయ్‌ తోమర్‌ను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినట్లు ఆరోపిస్తున్న ఫామ్‌హౌస్‌ ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ స్వతంత్ర ఎమ్మెల్యేకు చెందినదిగా పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement