లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం జరగడంతో గ్రామ పంచాయతీలో పరిష్కరించేందుకు ప్రయత్నించారు. 16 ఏళ్ల బాలిక, మైనర్ బాలుడి కుటుంబాలపై ఒత్తిడి తెచ్చి రాజీకి అంగీకరించేలా చేశారని, బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమెను అదే బాలుడికి ఇచ్చి వివాహం చేయాలని పంచాయతీ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు, బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించిన తర్వాత గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఇరు కుటుంబాలు రాజీకి రావాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోమవారం బాలిక, బాలుడికి రోకా, తిలక్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం జరిపించాలని పంచాయతీ నిర్ణయించింది.
బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఆ బాలుడు సుమారు ఏడాది క్రితం తన కుమార్తెను బెదిరించి అభ్యంతరకర ఫొటోలు తీసుకున్నాడు. వాటిని బయటపెడతానని బెదిరిస్తూ దాదాపు ఏడాది పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. భయంతో ఉన్న బాలికను కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో ఆమె జరిగిన విషయాన్ని వెల్లడించింది. అనంతరం కుటుంబ సభ్యులు బాలుడి ఇంటికి వెళ్లగా అక్కడ కూడా బెదిరింపులు ఎదురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో షీష్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలికపై అత్యాచారానికి సంబంధించిన సమాచారం అందడంతో కేసు నమోదు చేసినట్లు బరేలీ పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. బరేలీ పోలీసు అధికారి అరుణ్ కుమార్ సింగ్ తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరు కుటుంబాలు రాజీకి అంగీకరించినట్లు చెబుతున్నప్పటికీ, అసలు ఫిర్యాదు ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో గ్రామ పంచాయతీ జోక్యం, కుటుంబాలపై జరిగినట్లు ఆరోపిస్తున్న ఒత్తిడిపై కూడా ఇప్పుడు దృష్టి నెలకొంది.


