సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు విషయంలో ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఇక తామే చేపడతామని చెబుతూ.. ఏపీ హైకోర్టు విచారణపై స్టే విధిస్తూ తక్షణమే ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. డీజీపీతో పాటు విజయవాడ సీపీలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు. బుధవారం జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో హైకోర్టు విచారణపై స్టే విధిస్తూ..ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
సెప్టెంబర్ 30లోపు సాయికృష్ణ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టులోని ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను, రికార్డులను తమకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.
ఈ క్రమంలో సాయికృష్ణ కేసు దర్యాప్తు జరిగిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘గాదె సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు?. డీజీపీ నిద్ర పోతున్నారా?. పోలీసు కస్టడీలో సాయికృష్ణ అదృశ్యం కావడం చట్టవిరుద్ధం. పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేస్తే ఏసీపీ చూస్తూ కూర్చున్నారా?. మీ డ్యూటీ మీకు తెలియదా?. మీ తీరు ఘోరంగా ఉంది. సాయికృష్ణ మృతదేహం ఇప్పటిదాకా దొరకలేదంటే.. పోలీసుల దర్యాప్తు తీరు ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది’’ అంటూ ధర్మాసం వ్యాఖ్యానించింది.


