బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా? | Kommineni Srinivasa Rao Comments On Chandrababu DSC Dispute | Sakshi
Sakshi News home page

బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?

Sep 23 2026 11:31 AM | Updated on Sep 23 2026 12:57 PM

Kommineni Srinivasa Rao Comments On Chandrababu DSC Dispute

ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆవేదన కలిగిస్తాయి. ఈవీఎంలు మాయ కాకుండా నిజంగానే ప్రజల ఓట్లతోనే బీజేపీ, టీడీపీ,జనసేన  కూటమి గెలిచి ఉంటే ఇంత అరాచకంగా, అధ్వాన్నంగా పాలన సాగిస్తుందా?అన్న సందేహం రోజురోజుకు బలపడుతోంది. విజయవాడలో స్పోర్ట్స్ అధారిటీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా చేయడానికి వెళ్లినప్పుడు వారిపై దాడి జరిగిన తీరు, తదుపరి అరెస్టులు, కేసులు వారిపైనే  పెట్టిన వైనం గమనిస్తే , ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది. 

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు నిజాలు మాట్లాడుతూ ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలి. కాని దురదృష్టవశాత్తు చంద్రబాబు  అందుకు విరుద్దంగా నిత్యం అబద్దాలు చెబుతూ, ఏపీని అబద్దాల సమాజంగా మార్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విషయం చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక అసత్యం చెబితే సరిపోతుందన్న ధోరణితో ఆయన సాగుతున్నారన్న భావన ఏర్పడుతోంది. విజయవాడలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి జరిగితే ఆయన గురువులపై వైఎస్సార్‌సీపీ గూండాలు దాడి చేశారని కుప్పంలో స్పీచ్ ఇచ్చారు. 

ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి అసలు టీడీపీ వారు కాని, టీచర్ల పేరుతో వచ్చిన గూండాలు కాని, లోకేష్ యువగళానికి చెందినవారుకాని చేసిన   దుశ్చర్యల గురించి మాట మాత్రం రాయకుండా వైఎస్సార్‌సీపీ వారే దాడులు చేశారన్నట్లుగా తెగబడి రాశాయంటే ఏమిటి అర్దం?. డీఎస్సీ అక్రమాల కేసు ఆధారాలతో సహా బయటపడటంతో ఏం చేయాలో దిక్కుతోచక ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న భావన కలగదా!. ఒక వేళ ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ వారి వైపు నుంచి కూడా ఏదైనా తప్పు ఉంటే అది రాయవచ్చు. 

అలాగే టీడీపీ వారు ఎందుకు అలా అరాచకంగా ప్రవర్తించారో తెలియచేయాలి. అదేమీ లేకుండా పూర్తి ఏకపక్షంగా కదనాలు ప్రచారంలోకి తెచ్చారంటే విద్యా శాఖ మంత్రి లోకేష్ ను ఈ స్కామ్ నుంచి బయట వేయడానికి ఎదురుదాడి ఒకటే మార్గమని ఎంచుకున్నట్లు అనిపించదా!అధికారం ఉంది కనుక ,పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారి నిష్పక్షపాతంగా పనిచేయడం మానివేసింది కనుక దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టవచ్చు. వారిని అరెస్టు చేయవచ్చు. అంతమాత్రాన ప్రభుత్వం ఎస్కేప్ అయిపోతుందని అనుకుంటే పొరపాటు.ఎందుకంటే సోమవారం నాటి ఈ ఏపీసోడ్ మొత్తం ప్రభుత్వ బలహీనతను బయటపెట్టింది. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని అనుమానాలు పెంచింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ దర్నాకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించడమే ఆశ్చర్యం. అంత ప్రమాదం ఏమి వచ్చిందని వారి నిరసనకు అనుమతి ఇవ్వలేదు? అయినావైఎస్సార్‌సీపీ నిరసనపై ముందుకు వెళ్లింది. 

అలా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు పోలీసులను తోసుకుంటూ ముందుకువెళ్లలేదా? అనివైఎస్సార్‌సీపీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తే తప్పేమిటన్నది వారి వాదన. డీఎస్సీ అభ్యర్దుల పేరుతో ప్రభుత్వం చేయించిన ర్యాలీలకు ఎలా పర్మిషన్ లభించింది?అంటే చట్టం అన్ని పక్షాలకు ఒకరకంగా ఉండడం లేదన్న విషయం అర్ధం అవుతూనే ఉంది కదా? టీడీపీ కార్యకర్తలు,గూండాలు, టీచర్ల ముసుగులో వచ్చిన రౌడీలు శాప్ కార్యాలయ ఆవరణలోకి ఎలా వెళ్లారు? అక్కడ వారికి షామియానాలు, కుర్చీలు వేసి ఎలా సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన నిమిత్తం అక్కడకు వెళితే వారు ఎలా ఎగబడ్డారు? కొందరైతే పోలీసుల నుంచి లాఠీలు లాక్కుని మరీ దాడి చేశారట. నోటికొచ్చిన బూతులతోవైఎస్సార్‌సీపీ నేతలను తిట్టారట. 

ఎంత వీలైతే అంత వైఎస్సార్‌సీపీ వారిని రెచ్చగొట్టారన్నమాట. అలా చేసినప్పుడు ఎవరైనా కొంతమంది ఆవేశపడుతుంటారు. అప్పుడు వారికి రౌడీ ముద్ర  వేసి ప్రచారం చేస్తారన్నమాట. దాడులలో గాయపడ్డది వైఎస్సార్‌సీపీ నేతలు కదా!అయినా వారిపైనే కేసులు పెట్టారు. పైగా కొందరిపై హత్యాయత్నం కేసు వరకు పెడుతున్నారట. పోనీ దాడులు చేసిన టీడీపీవారిపై కూడా కేసు పెట్టారా అంటే అలాంటిదేమీ లేదట. టీడీపీ పక్షాన గూండాయిజం చేసిన కొందరు తాము యువగళం టీమ్ అని ఓపెన్ గానే చెప్పుకున్నారే. ఎల్లో మీడియా ఈ ఉదంతం మొత్తాన్ని వక్రీకరించి ప్రచారం చేసే క్రమంలో తొలుతటీడీపీవారిపైనే వైఎస్సార్‌సీపీ దాడి అని స్టోరీలు ప్రచారం చేసింది.

కాని అంతలో వారికి కొత్త ఐడియా వచ్చినట్లు ఉంది. టీడీపీ వారిపైన దాడి అంటే,వైఎస్సార్‌సీపీ నిరసన సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారని జనం అనుకుంటారని భావించి మొత్తం కధను మార్చి గురువులపై దాడి అని కొత్త స్టోరీ అల్లారట. ముఖ్యమంత్రి సైతం ఇదే ప్రకారం ఉపన్యాసం ఇచ్చారు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారని అర్ధం అవుతోంది కదా! గొడ్డలి పార్టీ అని చంద్రబాబువైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అంటే, వెన్నుపోటు పార్టీ టీడీపీ అని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. ఇదంతా చంద్రబాబుకు గౌరవం అయిన సంగతేనా? అర్హులైన టీచర్ అభ్యర్ధులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రసంగంలోని కొన్ని అంశాలు చూడండి.క్రీడా కోటాలో తప్పులు జరిగాయని, ఆ ఉపాధ్యాయులంతా బోగస్ అని అంటున్నారని చంద్రబాబు  ఆరోపించారు.

ఇదీ చదవండి: అందుకే ఈ అరాచకాలా..?

వైఎస్సార్‌సీపీ ఎన్నడూ అందరూ బోగస్ అని అనలేదు. తప్పుడు క్రీడా సర్టిఫికెట్లు తెచ్చి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు  పొందిన పలువురి వివరాలు వెల్లడించి విమర్శలు చేస్తోంది. ఆ నిర్దిష్టమైన  కేసులలో ఇంతవరకు చంద్రబాబు,లేదా మంత్రి లోకేష్  వివరణ ఇవ్వలేకపోయారు. వైఎస్సార్‌సీపీ హయాంలో  పోటీలలో పాల్గొని వారి చేతుల మీదుగానే ధృవపత్రాలు పొందినవారిని ఫేక్ అంటున్నారని ఆయన చెప్పారు. ఇందులోను నిజం లేదు. ఫేక్ పత్రాలతో కొంతమంది పోస్టులు సాధించారా? లేదా? అన్నదాని పై ఆయన  మాట్లాడడం లేదు. విజయవాడలో గురువులపై  రౌడీలు దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది కూడా నిజం కాదు. వైఎస్సార్‌సీపీ ధర్నా చేయాలని తలపెడితే అక్కడ టీడీపీ గూండాలు, టీచర్ల ముసుగులో రౌడీలు ఎందుకు ఉన్నారని ఎవరికైనా సందేహం వస్తుంది కదా! అసెంబ్లీకి వచ్చే ధైర్యంవైఎస్సార్‌సీపీకి లేదని చంద్రబాబు అన్నారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. కాని మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు  హాజరవుతున్నారు కదా!అక్కడ ఎందుకు చర్చకు టీడీపీ  వెనుకాడింది  అంటే జవాబు ఇవ్వరు. లోకేష్ మండలికి హాజరైనా దాని గురించి ఎందుకు వాదన వినిపించలేకపోయారు.వైఎస్సార్‌సీపీ సహభ్యుల ప్రశ్నలకు బదులు ఇవ్వలేదంటే సమాధానం ఇవ్వరు. కొందరు టీచర్లను తీసుకువచ్చి ర్యాలీలు చేయించి   ఒక రాజకీయ పార్టీని ఇష్టం వచ్చినట్లు దూషింపచేస్తారా?మాజీ ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకువస్తున్నట్లు అనిపించదా!ఇవన్ని ఎందుకు! అసలు డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్న  నమ్మకం ఉంటే వైఎస్సార్‌సీపీ అదినేత జగన్ సవాల్  చేసినట్లు సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా! పైగా తన టైమ్ లో జరిగిన ఏపీపిఎస్సిపై కూడా సిబిఐ విచారణ వేసుకోండని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కదా!దాని గురించి ప్రస్తావించకుండా  ఏపీపిఎస్సిపై వైఎస్సార్‌సీపీ మాట్లాడడం లేదని చంద్రబాబు  అనడం ఏమిటో అర్దం కాదు..

టీచర్ల నియామకాలపై అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చని,కోర్టు ఆదేశిస్తే  చర్య తీసుకుంటామని అన్నారు. ఉద్యోగాలు రాని అనేక మంది కోర్టుకు వెళితే అసలు కేసే విచారణకు రాకుండా చేస్తున్నారని వారు బహిరంగంగానే  చెబుతున్నారే? కోర్టులో విచారణకు రెడీ అయిన ప్రభుత్వం వారు సిబిఐ దర్యాప్తునకు  ఎందుకు వెనుకాడుతున్నారు?జగన్ మళ్లీ సోమవారం నాడు కూడా డీఎస్సీ స్కామ్ పై 14 ప్రశ్నలు  వేశారు. చంద్రబాబు, లోకేష్ లు  తమకు తామే  సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. జగన్ ప్రశ్నలపై చంద్రబాబు ఎప్పటికైనా స్పందిస్తారా?అన్నది అనుమానమే. ఒక్క మాట చెప్పాలి. డెబ్బైఆరేళ్ల వయసులో ఎంతో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హోదాకు తగ్గట్లు వ్యవహరించలేకపోతున్నారనిపిస్తుంది. ఇదంతా పుత్ర ప్రేమా?లేక సహజంగా వచ్చిన అలవాటా?అంటే ఏమి చెబుతాం!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement