యూపీలో రాజ్యసభ ఎన్నికల సందడి.. అక్టోబర్‌ 16న పోలింగ్ | UP Rajya Sabha Polls on October 16, BJP Eyes 8 Seats | Sakshi
Sakshi News home page

యూపీలో రాజ్యసభ ఎన్నికల సందడి.. అక్టోబర్‌ 16న పోలింగ్

Sep 23 2026 10:06 AM | Updated on Sep 23 2026 10:33 AM

UP Rajya Sabha Polls on October 16, BJP Eyes 8 Seats

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌ 19లోపు పూర్తవుతుంది.

బీజేపీకి 8 స్థానాలు?
403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం 397 మంది సభ్యులున్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 289 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీకి 101 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత బలాబలాల ఆధారంగా బీజేపీ నేతృత్వంలోని కూటమి 8 రాజ్యసభ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉందని, ఎస్పీ తన స్థానాలను రెండుకు పెంచుకోవచ్చని ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది.

బీఎస్పీకి రాజ్యసభలో..
బహుజన్ సమాజ్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఏకైక సభ్యుడు రాంజీ గౌతమ్ పదవీకాలం నవంబర్‌ 25తో ముగియనుంది. యూపీ అసెంబ్లీ, శాసన మండలి, లోక్‌సభలోనూ బీఎస్పీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం లేదని నివేదిక తెలిపింది. దీంతో తాజా ఎన్నికల తర్వాత పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రాతినిధ్యం పూర్తిగా ముగిసే పరిస్థితి ఏర్పడింది.

క్రాస్‌ ఓటింగ్‌పై రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ
2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌తో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుందని నివేదిక పేర్కొంది. ఈసారి కూడా క్రాస్‌ ఓటింగ్‌ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై కొందరు ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి ప్రభావం చూపవచ్చని హిందుస్థాన్ టైమ్స్ విశ్లేషించింది.

సెప్టెంబర్‌ 29న నోటిఫికేషన్‌
రాజ్యసభ ఎన్నికలకు సెప్టెంబర్‌ 29న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్‌ 6 చివరి తేదీ. అక్టోబర్‌ 7న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు
యూపీలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. ఐదు గ్రాడ్యుయేట్‌, ఆరు టీచర్‌ నియోజకవర్గాల స్థానాలకు అక్టోబర్‌ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్‌ 27న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌ 31లోపు పూర్తవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement