కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో, మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక గుర్తు ‘జోడా ఘాస్’ (పూలు-గడ్డి)ను కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా రద్దు చేసింది.
మమతా బెనర్జీ వర్గానికి ‘ఫుట్‌బాల్ ఆటగాడు’ గుర్తును కేటాయించగా, టీఎంసీలోని రెబల్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత, ఎమ్మెల్యే రితబత్ర బెనర్జీ వర్గానికి ‘ఎన్వలప్’ (కవర్) గుర్తును కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎంసీలో తలెత్తిన అంతర్గత కలహాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రెండు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, అధికార టీఎంసీ 80 సీట్లతో ఓటమి పాలైంది. ఈ భారీ పరాజయం తర్వాత టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు తలెత్తింది.
రితబ్రత బెనర్జీ వంటి నేతల నేతృత్వంలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వ శైలిని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ రెబల్ క్యాంపుగా ఏర్పడ్డారు. జూన్ 22 నాటికి ఈ రెబల్ వర్గం మమతా బెనర్జీని పార్టీ ఛైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించి, అరూప్ రాయ్‌ను ‘అసలైన టీఎంసీ’ చైర్మన్‌గా ప్రకటించుకుంది.
దీంతో అసలైన తృణమూల్ ఎవరిది? అనేదానిపై ఇరు వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. దీనిపై సమగ్ర విచారణ ముగిసే వరకు వివాదాస్పదమైన అసలు పేరును, గుర్తును నిలిపివేస్తూ ఈసీ ఈ మధ్యంతర నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే ఉపఎన్నికల్లో ఇరు వర్గాలు పూర్తిగా కొత్త గుర్తింపులతోనే బరిలోకి దిగాల్సి వస్తోంది. కాగా, అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజిన్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చదవండి : బెంగాల్ ఉప ఎన్నికలు.. ఈసీ బిగ్ ట్విస్ట్


