ఆర్ట్ అండ్ కల్చర్
ఫిగరేటివ్ పెయింటింగ్స్‌కు పెట్టింది పేరు షిప్ర భట్టాచార్య. కోల్‌కత్తాకు చెందిన ఆర్టిస్ట్ షిప్ర చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శితమయ్యాయి.
తాజా విషయానికి వస్తే... ‘రెట్రోస్పెక్టివ్’పేరుతో చెన్నైలో ఆమె ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. షిప్ర భట్టాచర్యా కళాప్రస్థానంలో రచనలు, చిత్రాలు, శిల్పాలను ‘రెట్రోస్పెక్టివ్’ ఒకేచోట చేర్చింది. నిత్య జీవితం నుంచి ఆత్మపరిశీలన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలలో అంతర్లీనంగా ప్రకాశిస్తాయి.
స్త్రీలు ఆమె చిత్రాలలో ప్రధానంగా కనిపిస్తారు. అయిదు దశాబ్దాల కాలంలో ఒక ఆర్టిస్ట్ ఈ ప్రపంచాన్ని చూసే విధానానికి ‘రెట్రోస్పెక్టివ్’ అద్దం పడుతుంది. షిప్ర భట్టాచార్య విషయంలో అలాగే జరిగింది. ఆర్టిస్ట్‌గా అడుగులు మొదలుపెట్టిన కొత్తలో ఆమె చిత్రాలలో ప్రకృతి దృశ్యాలు ప్రధానంగా కనిపించేవి. ఆ తరువాత భిన్న రకాలైన జీవన అనుభవాలు చిత్రరూపాల్లో కనిపించాయి. ‘నేను చిత్రాలు ఎందుకు వేస్తానో చెప్పడం కష్టం.
కాని అవి నాకు ఆసక్తి కలిగించేవి. ఉత్సుకతను రేకెత్తించేవి. నా చిత్రాలు నా చుట్టూ ఉన్న దృశ్యాలకు సంకేతం. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు, అభి్రపాయాలు మారుతుంటాయి. నా విషయంలోనూ అదే జరిగింది. ఆ మార్పు నా చిత్రాలలో కనిపిస్తుంది’ అంటారు షిప్ర భట్టాచార్య. ఆమె కాన్వాస్ డైరీలోని చిత్రపరంపరను చూడడానికి ‘రెట్రోస్పెక్టివ్’ ఒక అవకాశం.


