నీలగిరులకు ఆ పేరును సార్థకం చేసిన అరుదైన, అందమైన పువ్వు నీలికురింజి. పన్నెండేళ్లకోసారి ప్రకృతిలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించే ఈ పూల వెనుక ఉన్న నిజానిజాలు, వాటి జీవిత చక్రం, విశేషాల గురించిన ఆసక్తికరమైన వివరాలివి.
నీలికురింజి ప్రత్యేకతలు
శాస్త్రీయ నామం: స్ట్రోబిలాంథెస్ కుంతియానా
జీవిత కాలం: ఈ మొక్కలు సాధారణంగా 12 సంవత్సరాలు జీవిస్తాయి. ఒకేసారి భారీ స్థాయిలో పూస్తాయి, విత్తనాలను భూమ్మీద రాల్చిన తర్వాత ఆ మొక్క మరణిస్తుంది.
వ్యాప్తి: పశ్చిమకనుమల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలలో ఇవి విస్తరించి ఉంటాయి.
ముందస్తు పూతపై గందరగోళం!
వాస్తవం: ఎరవికుళం నేషనల్ పార్క్‌లో 2018లో నీలికురింజి పూసింది. తర్వాతి బ్లూమింగ్ 2030లో ఉంటుందని అంచనా. అయితే మున్నార్‌లో ఈ ఆగస్టు నుంచి ఈ పూలు వికసించడంతో ఇవి కాలనియమం తప్పుతున్నాయా అనే సందేహం కలుగుతుంది. కానీ, ప్రకృతి తన టైమ్‌టేబుల్‌ని కచ్చితంగా పాటిస్తుంది.
వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలచక్రాలు: ఎరవికుళం నేషనల్ పార్క్, మున్నార్‌లోని మట్టుపెట్టి ప్రాంతాలు వేర్వేరు కాలనీలు. చోక్రముడి, మట్టుపెట్టి, కన్నెమల కొండల్లో నీలికురింజి 2014లో పూసింది, ఆ కాలనియమం ప్రకారం ఇప్పుడు సరిగ్గా పన్నెండేళ్లకు మళ్లీ వికసించాయి.
ఈ ప్రకృతి చక్రం ఎలా పనిచేస్తుంది?
మోనోకార్పిక్ మొక్కలు: ఇవి ప్లీటీసియల్ జీవిత చక్రాన్ని అనుసరిస్తాయి. ఒక దశాబ్దానికి పైగా పెరిగి, పరిపక్వత చెంది, తగినంత శక్తిని కూడగట్టుకుని ఒకేసారి వికసించి ఆ తర్వాత అంతరిస్తాయి.
ఇదీ చదవండి: దెయ్యం మొక్క... తిస్మియా డెమోనా
స్వతంత్ర సమూహాలు: వేర్వేరు పర్వత శ్రేణులు వేర్వేరు సంవత్సరాలలో పరిపక్వం చెందుతాయి. ఉదాహరణకు, ఎరవికుళంలో పూసే కాలానికి నాలుగేళ్ల ముందు మున్నార్‌లో ఈ పూలను చూడవచ్చు. 2022లో కర్నాటకలోని చంద్రద్రోణ కొండల్లో కూడా ఇవి వికసించాయి. టూర్ ఆపరేటర్లు ఎరవికుళం షెడ్యూల్‌ను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఈ చిన్న అపోహ కలుగుతుంది.
పువ్వును చూడాలి... కోయవద్దు!
నీలికురింజి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కింద సంరక్షణలో ఉన్న మొక్క. వీటిని కోయడం, మొక్కను నాశనం చేయడం చట్టరీత్యా నేరం.
నిబంధనలు: నిబంధనలను ఉల్లంఘించి ఈ పూలను కోస్తే, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 25,000 వరకు జరిమానా, లేదా రెండూ విధించడం జరుగుతుంది. కాబట్టి వీటి సౌందర్యాన్ని కళ్లతో ఆస్వాదిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం! ఈ అరుదైన నీలికురింజి పూల అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి గతంలో పశ్చిమ కనుమల ప్రాంతాలను సందర్శించారా? ఇప్పటి వరకు చూడకపోతే ఇప్పుడు చూసితీరాలి.
– సాక్షి, స్పెషల్ డెస్క్


