రాజకీయాల్లో రెబల్స్ వ్యవహారం కొత్తేమీ కాదు.. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి బయటకు వచ్చేవాళ్లు, ఆ తర్వాత ప్రత్యర్థి కూటములతో చేతులు కలిపేవాళ్లు చాలాచోట్ల కనిపిస్తూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు ఈ తిరుగుబాట్లే స్థానిక రాజకీయాల దిశను మార్చేస్తాయి. కేరళలోనూ ఇప్పుడు అదే జరిగింది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన బిజు మాథ్యూస్.. ఎల్‌డీఎఫ్ మద్దతుతో స్టన్నింగ్ విక్టరీ సాధించాడు.
కేరళలోని పాలా మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన బిజు మాథ్యూస్.. ఎల్‌డీఎఫ్ మద్దతుతో మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సెబాస్టియన్ పాలక్కల్‌పై 14–11 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మొత్తం 26 మంది సభ్యులున్న పాలా మున్సిపల్ కౌన్సిల్‌లో వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు 14 ఓట్లు అవసరం. బిజు మాథ్యూస్‌కు కేరళ కాంగ్రెస్ (ఎం) నుంచి 10, సీపీఎం నుంచి 2, చైర్‌పర్సన్ మాయా రాహుల్ నుంచి ఒక ఓటు.. ఆయన సొంత ఓటు కలిపి మొత్తం 14 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ రాజితా ప్రకాశ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మరో ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ టోనీ తైప్పరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ మాత్రం యూడీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్‌కు ఓటేయడం గమనార్హం.
అక్కడే ఈ రాజకీయ మలుపు..
పాలా మున్సిపాలిటీలో అధికార మార్పిడికి కాంగ్రెస్ రెబల్స్ కీలకంగా మారారు. గతంలో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఎల్‌డీఎఫ్ మద్దతుతో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన బిజు మాథ్యూస్, టోనీ తైప్పరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజితా ప్రకాశ్‌లను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే వీళ్లు ఎల్‌డీఎఫ్‌తో చేతులు కలపడంతో పాలా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
దియా బిను పులిక్కకండంను అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించిన తర్వాత.. కాంగ్రెస్ రెబల్ మాయా రాహుల్ ఎల్‌డీఎఫ్ మద్దతుతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో కేరళ కాంగ్రెస్ (ఎం) నేతృత్వంలోని మున్సిపాలిటీ డెవలప్‌మెంట్ ఫ్రంట్ పాలా మున్సిపాలిటీపై పట్టు సాధించింది. అదే కూటమికి ఇప్పుడు బిజు మాథ్యూస్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చర్చలు.. ఆపై ట్విస్ట్
మాయా రాహుల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత వైస్ చైర్‌పర్సన్ పదవి ఖాళీ అయింది. ఈ పదవిపై బిజు మాథ్యూస్, టోనీ తైప్పరంబిల్ ఇద్దరూ ఆసక్తి చూపడంతో కూటమిలో చర్చలు జరిగాయి. చివరకు ఎల్‌డీఎఫ్ మద్దతు బిజుకు దక్కింది. ఎన్నికకు ముందు ఆయనకు కూటమిలో మెజారిటీ మద్దతు ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. మిగతా రెబల్స్ మాత్రం అధికార పక్షం వైపే మొగ్గు చూపించారు.
ఇదిలా ఉండగా.. పాలా మున్సిపాలిటీలో పార్టీ మార్పిడి వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టింది. మాయా రాహుల్‌తో పాటు మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్లు బిజు మాథ్యూస్, టోనీ తైప్పరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజితా ప్రకాశ్‌లకు యాంటీ డిఫెక్షన్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. యూడీఎఫ్, స్వతంత్ర కౌన్సిలర్ బిను పులిక్కకండం చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో ‘చేదు’ అనుభవం.. బీజేపీకి ఇక గడ్డు కాలమేనా?


