రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీలో కొత్త చర్చకు తెరతీశాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేసిన పార్టీకి.. కీలక నేతల సొంత ప్రాంతాల్లోనే ఓటర్లు గట్టి సంకేతం ఇచ్చారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్, కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో సీఎం స్వయంగా రోడ్‌షోలు నిర్వహించినప్పటికీ.. ఆ ప్రభావం ఫలితాల్లో పూర్తిగా కనిపించలేదు. మొత్తం 65 వార్డులున్న భరత్‌పూర్ నగర పాలక సంస్థలో బీజేపీ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలుచుకోగా.. ఏకంగా 36 వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలంటే బీజేపీకి స్వతంత్రుల మద్దతు తప్పనిసరి కానుంది.
అధ్యక్షుడి ఇలాకాలోనూ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్ సొంత జిల్లా పాలీలోనూ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 65 వార్డుల్లో కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 21 స్థానాల వద్దే ఆగిపోయింది. మరో 15 స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. బోర్డు ఏర్పాటుకు 34 స్థానాలు అవసరం కావడంతో.. ఇక్కడ కూడా స్వతంత్రులే కీలకం కానున్నారు.
వసుంధర గడ్డలో కాంగ్రెస్ జెండా..
మాజీ సీఎం వసుంధర రాజే ప్రభావం బలంగా ఉన్న ఝలావార్‌లో బీజేపీకి మరింత పెద్ద షాక్ తగిలింది. ఝలావార్ మున్సిపల్ కౌన్సిల్‌లోని 45 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 29 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో అక్కడ బీజేపీ అధికారం కోల్పోయింది. వసుంధర ప్రభావం ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
భూపేంద్ర యాదవ్ ప్రాంతంలోనూ..
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అల్వార్ ప్రాంతంలోనూ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం 65 వార్డుల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 23 సీట్లు దక్కించుకుంది. మరో 13 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఒక స్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. దీంతో ఇక్కడ కూడా బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించలేదు.
జోధ్‌పూర్‌లో హోరాహోరీ..
ఇటు జోధ్‌పూర్‌లోనూ బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. 100 వార్డులున్న నగర పాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 44 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 11 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో బోర్డు ఏర్పాటులో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది.
బికనీర్‌లో కాంగ్రెస్ దూకుడు
కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న బికనీర్ బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం 80 వార్డుల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీజేపీ 27 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు బోర్డు ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది.
2028కి ముందు హెచ్చరికేనా?
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 4,179 వార్డులు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 3,613, స్వతంత్రులు 2,273 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్, ఇండిపెండెంట్ల బలం స్పష్టంగా కనిపించింది. అయితే భరత్‌పూర్, పాలి, ఝలావార్, అల్వార్, జోధ్‌పూర్, బికనీర్ వంటి కీలక ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికగా మారాయి.
ముఖ్యంగా సీఎం నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వరకు కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీకి స్పష్టమైన ఆధిపత్యం దక్కకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఈ ఫలితాలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: షాకింగ్.. రైల్వే స్టేషన్‌లలో రైల్వే వాళ్లు ఇచ్చే నీళ్లు ఎలాంటివో తెలుసా?


