బాలీవుడ్ నటుడు గోవిందా అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశ్వర్ధన్ అహూజాలతో కలిసి గణపతి దర్శనం చేసుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కుటుంబంతో కలిసి ఫొటోలకు పోజిచ్చిన సమయంలో ఆయన భార్య సునీతా అహూజా ఎక్కడా కనిపించలేదు.
పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థనలు
గణపతి ఆశీస్సులు తీసుకున్న గోవిందా.. తన కుమారుడు యశ్వర్ధన్‌కు మంచి భవిష్యత్తు రావాలిని కోరుకున్నారు. కుటుంబంలో గణపతి వేడుకల సంప్రదాయం తన తల్లి నుంచే ప్రారంభమైందని ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా తాను ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని, ఇప్పుడు యశ్వర్ధన్ కూడా దానిని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కుమారుడికి విజయాలు, సిరిసంపదలు కలగాలని గణపతిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడిన అనంతరం గోవిందా తన పిల్లలు టీనా, యశ్వర్ధన్‌లతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. అయితే ఆ సమయంలో సునీతా అహూజా ఫొటోలో కనిపించలేదు. అంతకుముందు సునీతా అహూజా తన పిల్లలతో కలిసి ఉత్సాహంగా గణపతి వేడుకలను ప్రారంభించారు. సాధారణంగా గోవిందా లేదా యశ్వర్ధన్ గణపతిని ఇంటికి తీసుకొస్తారని, ఈసారి తానే పాటలు, నృత్యాలతో గణపతిని ఇంటికి తీసుకొచ్చానని ఆమె తెలిపారు. గత ఏడాది వినాయకుడు తనకు ఎంతో పేరు, విజయాన్ని అందించారని చెప్పారు. అందుకే ఈసారి స్వయంగా గణపతిని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాగా వేడుకల ఫొటోల్లో సునీత కనిపించకపోవడంతో మరోమారు గోవిందా వార్తల్లో నిలిచారు.
ఇదీ చదవండి: అంబానీ గణేశ్ పూజకు.. ‘డీప్ నెక్’లో హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!


