హిందీలో ఎంబీబీఎస్‌.. నాలుగేళ్ల తర్వాత దిమ్మతిరిగే రిజల్ట్‌! | Hindi MBBS Experiment Faces Reality Check | Sakshi
Sakshi News home page

హిందీలో ఎంబీబీఎస్‌.. నాలుగేళ్ల తర్వాత దిమ్మతిరిగే రిజల్ట్‌!

Sep 15 2026 10:54 AM | Updated on Sep 15 2026 11:20 AM

Hindi MBBS Experiment Faces Reality Check

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యను హిందీలో అందించాలన్న ప్రయోగం నాలుగేళ్ల తర్వాత ఎలాంటి ఫలితాలు ఇచ్చిందన్న అంశంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో హిందీలో ఎంబీబీఎస్‌ చదువును ప్రారంభించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిచింది. వైద్య విద్యకు సంబంధించిన పుస్తకాలను హిందీలో రూపొందించి, వాటిని ఆవిష్కరించారు. ఉన్నత విద్యలో హిందీని ప్రోత్సహించే దిశగా ఇది కీలక ముందడుగుగా అప్పట్లో పేర్కొన్నారు.

అయితే నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ఈ ప్రయోగం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిందీలో ఎంబీబీఎస్‌ విద్య కోసం రూపొందించిన పుస్తకాలు ప్రస్తుతం గోదాముల్లోనే ఉన్నట్లు ‘ఆజ్‌తక్‌’ పేర్కొంది. హిందీ మాధ్యమంలో వైద్య విద్య కోసం దాదాపు రూ.9 కోట్ల విలువైన పుస్తకాలను సిద్ధం చేశారు. అయితే వాటి వినియోగంపై చర్చ మొదలైంది. హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్‌ చదివేందుకు విద్యార్థులు ఎంతమేరకు ఆసక్తి చూపుతున్నారన్నది వెల్లడయ్యింది.

మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థుల్లో సుమారు 90 శాతం మంది హిందీకి బదులుగా ఆంగ్ల మాధ్యమాన్నే ఎంచుకున్నట్లు ‘ఆజ్‌ తక్‌’ పేర్కొంది. దీంతో హిందీలో రూపొందించిన వైద్య పుస్తకాల వినియోగం పరిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ భాష గౌరవం, ప్రచారం, ప్రోత్సాహంపై చర్చ జరుగుతున్న సమయంలో మధ్యప్రదేశ్‌ ఇలాంటి పరిస్థితి కనిపించింది. 2022లో వైద్య విద్యలో స్థానిక భాషను ఉపయోగించాలన్న ఉద్దేశంతో పుస్తకాలను కూడా సిద్ధం చేశారు. అయితే నాలుగేళ్ల తర్వాత అధిక శాతం విద్యార్థులు ఆంగ్లానికే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హిందీలో వైద్య విద్యను అందించాలన్న ప్రయత్నం కొనసాగుతుందా? విద్యార్థులు హిందీ పుస్తకాలను వినియోగించేలా చేయగలరా? లేక ఆంగ్ల మాధ్యమానికే ఎక్కువ ప్రాధాన్యం కొనసాగుతుందా? రూ.9 కోట్ల విలువైన పుస్తకాల పరిస్థితి, 90 శాతం మంది విద్యార్థులు ఆంగ్లాన్ని ఎంచుకున్న విషయం అంతుచిక్కని అంశంగా మారింది. 

ఇదీ చదవండి: షాక్‌.. 1.14 లక్షల మందికి నాణ్యత లేని ‘రైల్‌ నీర్‌’?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement