ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో లోపభూయిష్ట విధానం
ఓపెన్ కేటగిరీ కటాఫ్ ర్యాంక్‌లు ఏయూలో 71,547,ఎస్వీయూలో 94,966
ఇంతకంటే మెరుగైన ర్యాంక్ సాధించిన 70 మంది విద్యార్థులను ఆయా రిజర్వేషన్ కేటగిరికి పరిమితం చేసిన వైనం
ఫలితంగా మంచి ర్యాంక్ తెచ్చుకున్న 70 మంది రిజర్వేషన్ విద్యార్థులకు తీరని నష్టం
ఇదంతా చంద్రబాబు సర్కార్ తెచ్చిన జీవో 102 ఫలితమే అంటున్న నిపుణులు
దీన్ని రద్దు చేసి గత ప్రభుత్వంలో అమలైన జీవో 151 పునరుద్ధరించాలని డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీ (ఓసీ)లో సీటు దక్కించుకోవాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను రిజర్వేషన్ కోటాకు కుదించి, సాధారణ మెరిట్ కలిగిన పేద వర్గాల విద్యార్థులు ప్రభుత్వ కోటా సీటు కోల్పోయే దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా మొదటి విడత సీట్లను గురువారం ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది.
ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) రీజియన్‌లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంక్ 71,547.. ఎస్వీయూ రీజియన్‌లో 94,966 ర్యాంక్‌కు చివరి సీటు దక్కింది. ఈ రెండు రీజియన్‌లలో ఓసీ కటాఫ్ కంటే ఎంతో మెరుగైన విద్యార్థులకు హెల్త్ యూనివర్సిటీ రిజర్వేషన్ కోటాలో సీట్లు కేటాయించింది. ఇలా ఏయూలో 43, ఎస్వీయూలో 27 మంది చొప్పున 70 మంది మెరిటోరియస్ విద్యార్థులకు ఓసీ విభాగంలో కాకుండా రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీటు ఇచ్చారు.
రెండు రీజియన్‌లలో సీట్ల కేటాయింపును పరిశీలిస్తే ఓసీ కటాఫ్ ర్యాంక్‌ల కంటే మెరుగ్గా 23,550, 30,307, 30,611, 31,325, 37,039 వంటి ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను సైతం రిజర్వేషన్ విభాగాల్లో సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ మెరిట్‌లోని రిజర్వేషన్ విద్యార్థుల్లో 70 మందికి నష్టం వాటిల్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీట్ల కేటాయింపు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబు తెచ్చిన జీవో 102 ఫలితమే
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ప్రస్తుతం రిజర్వేషన్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో 102 కారణమని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో హైకోర్టు ఆదేశాలు, నిపుణుల కమిటీ సూచనలతో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కోసం జీవో 151 రూపొందించారు. గత విద్యా సంవత్సరం వరకు అదే జీవో ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా ఉన్నఫళంగా జీవో 151 రద్దు చేసి, జీవో 102ను బాబు సర్కారు ప్రవేశపెట్టింది. జీవో 151 ప్రకారం అన్ని రౌండ్‌ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఆప్షన్‌లు లాక్ చేసేవారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులు ఎంచుకునేవారు. వీటి ఆధారంగా అన్ని రౌండ్‌లలో సీట్ల కేటాయింపు జరిగేది.
ఈ నేపథ్యంలో ఓసీ కటాఫ్ కంటే ఉత్తమ ర్యాంక్ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓపెన్‌లోనే సీట్లు ఇచ్చేవారు. ఫలితంగా రిజర్వేషన్ సీట్లు కింది ర్యాంకర్లకు దక్కేవి. పారదర్శకమైన ఈ విధానానికి పాతరేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో 102ను తీసుకొచ్చింది. తద్వారా విద్యార్థులు ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కు ఆప్షన్‌లు నమోదు చేయాలని సూచించింది. అదే విధంగా అన్ని కాలేజీలు ఆప్షన్‌ల కింద ఎంపిక చేసుకోవాల్సిన పని లేదని తేల్చేసింది. ఇలా బాబు సర్కార్ తెచ్చిన మార్పులతో రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
జీవో 102 రద్దు చేయాలి
రిజర్వేషన్ విద్యార్థులు ఉత్తమ మెరిట్ సాధిస్తే వారికి ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అన్యాయం చేశారు. ఇప్పటి వరకు సజావుగా, పారదర్శకంగా సాగిన సీట్ల కేటాయింపును జీవో 102తో గందరగోళం చేశారు. అసలు జీవో 151తో ఎవరికీ నష్టం లేదు. అయినా ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలియడం లేదు. ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ విద్యార్థులకు నష్టం చేస్తున్న జీవో 102 రద్దు చేసి, 151ని పునరుద్ధరించాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్
జరిగిన తప్పును సరిదిద్దాలి
సీట్ల కేటాయింపులో జరిగిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలి. నిబంధల ప్రకారం మెరిట్ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో సీట్లు కేటాయించాలి. రిజర్వేషన్ విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. ఈ ప్రభుత్వ గందరగోళ నిర్ణయాలతో ఇప్పటికే 70 మంది రిజర్వేషన్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. – డాక్టర్ అంబటి రాధాకృష్ణ, విజయవాడ


