విదేశీ చదువులపై తగ్గుతున్న మోజు
ఖర్చులు, వీసా సమస్యలతో మారుతున్న జెన్ జెడ్ లెక్కలు
ఎమిరిటస్ ‘ఇండియా జెన్ జెడ్ ఔట్‌లుక్–2026 నివేదిక వెల్లడి
అమెరికా వైపూ తగ్గుతున్న యువత మొగ్గు
దేశీయ అంతర్జాతీయ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ
వీసా టెన్షన్ లేకుండా విదేశీ యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లపై ఆసక్తి
డిగ్రీ కంటే ఖర్చు, ఉద్యోగ అవకాశాలకే ప్రాధాన్యం
విదేశాల్లో చదువు.. మంచి యూనివర్సిటీ.. ఆ తర్వాత మంచి ఉద్యోగం. ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలగా ఉన్న ఈ ఫార్ములాకు ఇప్పుడు జెన్ జెడ్ దూరం జరుగుతోంది. విదేశీ డిగ్రీలపై యువత ఆలోచన నెమ్మదిగా మారుతోంది.
సాక్షి, అమరావతి: విదేశాల్లో చదువు.. మంచి యూనివర్సిటీ.. ఆ తర్వాత మంచి ఉద్యోగం. ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలగా ఉన్న ఈ ఫార్ములాకు ఇప్పుడు జెన్ జెడ్ దూరం జరుగుతోంది. విదేశీ డిగ్రీలపై యువత ఆలోచన నెమ్మదిగా మారుతోంది. విదేశాలకు వెళ్లి చదవాలా? లేక అంతర్జాతీయ స్థాయి విద్యను భారత్‌లోనే పొందగలమా? అన్న అంశాన్ని కొత్త జెన్ జెడ్ బేరీజు వేస్తోంది.
ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ ఎమిరిటస్ విడుదల చేసిన ‘ఇండియా జెన్ జెడ్ ఔట్‌లుక్–2026: ది నో క్యాప్ జనరేషన్’ నివేదికలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. 15 నుంచి 28 ఏళ్ల వయసున్న 1,010 మంది అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. వారిలో 48 శాతం మంది గత ఏడాదితో పోలిస్తే విదేశీ విద్యపై తమకు అంత ఆసక్తి లేదని తెలిపారు.
ఖర్చే తొలి అడ్డంకి
విదేశీ చదువు అంటే ట్యూషన్ ఫీజు మాత్రమే కాదు. వసతి, ఆహారం, ప్రయాణం, బీమా, రోజువారీ జీవన వ్యయం కూడా కలుస్తాయి. కుటుంబాలు విద్యా రుణాలపై ఆధారపడితే.. చదువు పూర్తయ్యాక వచ్చే ఆదాయంతో ఆ రుణాన్ని ఎంతకాలంలో తీర్చగలమన్నది కీలకంగా మారుతుంది. అందుకే జెన్ జెడ్ ఇప్పుడు యూనివర్సిటీ బ్రాండ్ కంటే పెట్టుబడి–ప్రతిఫలంపై ఎక్కువ దృష్టి పెడుతోంది. విదేశీ చదువుపై ఆసక్తి తగ్గడానికి 37 నుంచి 41 శాతం మంది ఖర్చులను కారణంగా పేర్కొన్నారు.
వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అనిశ్చితే ఆటంకమని 26 నుంచి 34 శాతం మంది చెప్పారు. కుటుంబానికి దూరంగా ఉండటంపై 31 శాతం మంది, విదేశాల్లో భద్రత, రాజకీయ అనిశ్చితిపై 24 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం అభిప్రాయాల్లోనే కాకుండా వాస్తవంలోనూ ఆ మార్పు కనిపిస్తోంది. 2023లో సుమారు 8.95 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లగా, 2025లో ఈ సంఖ్య 6.19 లక్షలకు తగ్గిందనే గణాంకాలు వెలువడ్డాయి.
విదేశీ విద్య కావాలి.. కానీ దేశం దాటకుండానే
విదేశాలకు వెళ్లే ఆసక్తి తగ్గుతున్నా అంతర్జాతీయ విద్యపై ఆసక్తి మాత్రం తగ్గడం లేదని ఈ నివేదికలో తేలింది. ప్రీ–కాలేజ్ విద్యార్థుల్లో 87 శాతం, ఉన్నత విద్యలోకి మారుతున్న విద్యార్థుల్లో 92 శాతం మంది భారత్‌లోనే అంతర్జాతీయ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లను చదవడానికి సిద్ధంగా ఉన్నారు. వీసా సమస్యలు లేకుండా భారత్‌లోనే అంతర్జాతీయ ప్రోగ్రామ్ ఎంచుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
పీజీ విద్యను అభ్యసించాలనుకుంటున్న వారిలో 50 శాతం మంది మన దేశంలో పూర్తిగా క్యాంపస్ ఆధారిత అంతర్జాతీయ ప్రోగ్రామ్‌లపై మొగ్గు చూస్తున్నారు. హైబ్రిడ్ లేదా పాత్‌వే మోడల్‌పైనా ఆసక్తి పెరిగింది. అంటే మన దేశంలోనే చదువుతూ కొంతకాలం విదేశీ క్యాంపస్‌లో చదవడం లేదా అంతర్జాతీయ విద్యా అనుభవం పొందడం వంటి మార్గాలకు ఆదరణ పెరుగుతోంది.
మన దేశానికి అవకాశం.. పరీక్ష కూడా
ఇది భారత ఉన్నత విద్యకు అవకాశమని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. విదేశీ యూనివర్సిటీ క్యాంపస్‌లు, డ్యూయల్ డిగ్రీలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, హైబ్రిడ్ కోర్సులు పెరగడానికి ఇది అనుకూల వాతావరణాన్ని కల్పించవచ్చు. అయితే విదేశీ యూనివర్సిటీ పేరు భారత్‌లో ఉండటం ఒక్కటే సరిపోదని విశ్లేష్తున్నారు.
నాణ్యమైన ఫ్యాకల్టీ, పరిశోధన, అంతర్జాతీయ గుర్తింపు, పరిశ్రమతో అనుసంధానం, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు అందించగలిగితేనే ఈ మోడల్ నిజమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. జెన్ జెడ్ విదేశీ విద్యను తిరస్కరించడం లేదు. విదేశీ విద్య కోసం తప్పనిసరిగా విదేశాలకు వెళ్లాలనే భావనను మాత్రం ప్రశ్నిస్తోంది. నిన్నటి వరకు ఏ దేశానికి వెళ్లాలి? అన్నది ప్రశ్న అయితే.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి విద్యను తక్కువ ఖర్చు, తక్కువ రిస్క్‌తో ఎక్కడ పొందగలం? అన్నదే అసలు లెక్కగా మారుతోంది.
అమెరికాపైనా మారుతున్న లెక్కలు
అమెరికాను చదువుల గమ్యస్థానంగా భావించిన వారూ అక్కడికి వెళ్లడానికి ఇప్పుడు పెద్దగా ఇష్టపడడంలేదు. అమెరికా విద్యకు సంబంధించిన అధిక ఖర్చులు, వీసా ప్రక్రియ, చదువు తర్వాత పని చేసే అవకాశాలపై అనిశ్చితి వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. విదేశీ విద్య నిర్ణయం ఇప్పుడు కేవలం ప్రతిష్టకు సంబంధించినది కాదనే విషయం కనిపిస్తోంది. ఎక్కడ చదివావు? అనే అంశం కంటే ఎంత ఖర్చు పెట్టి ఏం సాధించావు? అన్నదే ముఖ్యమవుతోందని ఎమిరిటస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అశ్విన్ డామెరా తెలిపారు.


