రాంబాబు రాజు, శ్రీనివాసరాజు (ఫైల్)
మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన అన్నదమ్ములు ముదునూరి రామభద్రరాజు (రాంబాబు రాజు) (55), అతని తమ్ముడు ముదునూరి వెంకట సుబ్బరాజు (శ్రీనివాసరాజు) (52) అక్కడిక్కడే మృతి చెందారు. తోటికోడళ్లయిన రాంబాబు రాజు భార్య విజయలక్ష్మీ మాధురి, శ్రీనివాసరాజు భార్య శారద తీవ్రంగా గాయపడగా వారిని కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరు భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాంబాబు రాజు, విజయలక్ష్మీ మాధురి భీమవరంలో బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళారు. శ్రీనివాసరాజు, శారద తమ కుమార్తెను అమెరికా పంపించేందుకు బెంగళూరులో విమానం ఎక్కించి రైలులో భీమవరం వచ్చారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక రాంబాబు రాజు దంపతులు, భీమవరంలో రైలు దిగిన శ్రీనివాసరాజు దంపతులు కలిసి తెల్లవారుజామున కారులో లక్కవరం బయలుదేరారు.
మరొక్క నిమిషంలో ఇంటికి చేరుకుంటారనగా.. లక్కవరం ఓఎన్‌జీసీ సైట్ వద్ద వీరి కారు అదుపు తప్పి ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తోటికోడళ్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం వేకువజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ చేస్తుండగా కునుకు రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
ప్రయాణికులు సురక్షితం
పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. టీజీ13టీ1986 నంబరు గల బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గురువారం రాత్రి 8.40 గంటలకు బయలు దేరింది. బస్సులో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు.
తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో పామిడి దాటిన తర్వాత కాలుతున్న వాసన రావడంతో ప్రయాణికులు, డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ కొద్దిదూరంలోని మిడుతూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపేశారు. అందరూ దిగేయగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగి్నమాపక వాహనం ఘటన స్థలానికి చేరుకొనేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ రాఘవేంద్రప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


