అక్షర శిల్పి.. విజ్ఞాన జ్యోతి | - | Sakshi
Sakshi News home page

అక్షర శిల్పి.. విజ్ఞాన జ్యోతి

Sep 5 2026 12:26 AM | Updated on Sep 5 2026 12:26 AM

ఆచార్యుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌

రాజమహేంద్రవరంతో అనుబంధం

రెండేళ్ల పాటు ఆర్ట్స్‌ కళాశాలలో విధులు

నేడు ఆయన జయంతి,

ఉపాధ్యాయ దినోత్సవం

సీటీఆర్‌ఐ/కంబాలచెరువు(రాజమహేంద్రవరం): చిన్నారుల జీవితంలో అక్షర జ్యోతులు వెలిగించి, ఆ ప్రకాశంలో ఉన్నత శిఖరాలకు, గొప్ప పదవులకు, దేశం గర్వించే పౌరులుగా ఎదగడానికి దారి చూపే మార్గదర్శి ఉపాధ్యాయుడు. ఓనమాల నుంచి ఉన్నత చదువుల వరకు అనునిత్యం వెన్నంటి ఉండి, తప్పొప్పులను చెప్పి, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగేలా ఉపదేశించే రుషి. అందుకే ఆచార్య దేవోభవ అంటూ గురువుకు మన పెద్దలు అత్యంత ముఖ్యమైన స్థానం ఇచ్చారు. ఏటా సెప్టెంబర్‌ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటాం. ఈ సందర్భంగా ఆచార్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో మన అనుబంధం గురించి తెలుసుకుందాం.

తమిళనాడులో జననం

ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త, మేధావి, భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1888 సెప్టెంబర్‌ 5వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జన్మించారు. ఆయన పుట్టిన రోజును ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. దేశంలోనే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన ఆయనకు రాజమహేంద్రవరంతో ఎంతో గొప్ప అనుబంధం ఉంది. నగరంలో ఆయన నివసించింది కేవలం సుమారు 18 నెలలు మాత్రమే అయినా, ఆయన హృదయంలో రాజమహేంద్రవరం జ్ఞాపకాలు చివరి వరకూ పదిలంగానే ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి సందర్శకులు ఎవరు ఆయనను కలసినా, ఈ నగరం గురించి గుచ్చి గుచ్చి అడిగే వారని చెప్పారు. రాధాకృష్ణన్‌ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పదోన్నతిపై రాజమహేంద్రవరానికి వచ్చి, ఆర్ట్స్‌ కళాశాలలో తత్వశాస్త్రం (ఫిలాసపి)లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. గోదావరి ప్రశాంత వాతావరణం, ఇక్కడి సాంస్కృతిక వైభవం ఆయనను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన ప్రసిద్ధ గ్రంథాలలో ఒకటైన ‘ది ఫిలాసఫీ ఆఫ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌‘ పుస్తకానికి సంబంధించిన ప్రధాన ఆలోచనలు, రచనలు రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడే రూపుదిద్దుకున్నాయని ఆయన తన గ్రంథంలో వివరించారు.

మా అదృష్టం

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1917–19లో రాజమహేంద్రవరంలో ఆర్ట్స్‌ కళాశాలలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా సేవలందించారు. ఆయన పనిచేసిన కళాశాలలోనే మేమూ విధులు నిర్వర్తించడం ఎంతో గర్వకారణం. రాధాకృష్ణన్‌ వంటి మహనీయుల వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాం.

– డాక్టర్‌ రామచంద్ర ఆర్‌కే, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి)

దిక్సూచి ఉపాధ్యాయుడే

విద్యార్థుల ప్రగతికి బంగారు బాటలు వేసేవాడు ఉపాధ్యాయుడు. తల్లితండ్రుల తర్వాత ఉపాధ్యాయునికే ప్రాధాన్యత, విద్యార్థులకు అక్షరాలు నేర్పడమే కాకుండా నడవడిక, నడత నేర్పే దిక్సూచి ఉపాధ్యాయుడు.

– వి.అన్నపూర్ణ, ప్రిన్సిపాల్‌,

ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల

వెలకట్టలేనిది

గురువు స్థానం వెలకట్టలేనిది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అందుకు ఉదాహరణ. ఆయన పాఠాలను జీవితానికి ముడిపెట్టి చెప్పేవారు కాబట్టే విద్యార్థులు ఎంతో అభిమానించేవారు.

– రాజనాల రాజేశ్వరి, సంస్కృత అధ్యాపకురాలు, ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల

చరిత్ర విస్మరించిన సత్యం

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1917– 19 మధ్య కాలంలో ఆర్ట్స్‌ కళాశాలలో ఫిలాసఫీ బోధించారు. ఆ రోజు ల్లో ఈ కళాశాల నేటి గూడ్స్‌షెడ్‌కు ఎదురుగా ఉండేది. అక్కడ నుంచి ప్రస్తుత ప్రాంగణానికి మారాక, అక్కడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా మిగిలింది. రాధాకృష్ణన్‌ టి.నగర్‌లోని కొక్కొండ వారి వీధిలోని అరిపిరా ల పాపారావు పంతులు గారి ఇంటిలో నెలకు రూ.15 అద్దెతో నివసించేవారు. వసురాయకవితో గోదావరీ తీరంలో మెట్లపై కూర్చుని అనేక విషయాలు చర్చించుకునేవారు. అయితే ఆయన గురించి వెలువడిన అనేక గ్రంథాల్లో రాజమహేంద్రవరంలో నివసించిన విషయాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం మన దురదృష్టకరం. తెలుగు అకాడమీ వారి తెలుగు వెలుగులు పుస్తకంలో కూడా ఆయన మీద ప్రచురించిన వ్యాసంలో ఈ ప్ర స్తావన లేదు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు దివంగత వై ఎస్‌ నరసింహారావు మాత్రం తన స్వీయచరిత్ర ‘నరసింహావలోకనం’లో ఈ అంశాలను పేర్కొన్నారు.

ఆచార్య రత్నం

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను అందరూ ఆచార్య రత్నం అని గౌరవంగా పిలిచేవారు. ఆయన బోధనా శైలికి విద్యార్థులు ముగ్ధులయ్యేవారు. సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ఆయనకున్న పట్టు, భావాలను సరళంగా వివరించే విధానం వల్ల కాలేజీలో అత్యంత ప్రజాదరణ పొందిన అధ్యాపకుడిగా పేరుగాంచారు. రాజమహేంద్రవరం నుంచి మైసూర్‌ యూనివర్సిటీకి బదిలీపై వెళ్లే సమయంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement