కొత్తపల్లి: ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి ఉప్పాడ వైపు వెళుతున్న కారు జగనన్న కాలనీ సమీపంలో ఉప్పాడ నుంచి కాకినాడ వెళుతున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు, ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం కాకినాడ, పిఠాపురం తరలించారు. కారు డ్రైవర్ అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఇంకా సమాచారం అందలేదన్నారు.
ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
చాగల్లు: రాత్రి సమయాల్లో ఇళ్లలో బంగారం, వెండి వస్తువులను దొంగలిస్తున్న అంతర జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు రూరల్ సీఐ కె.విజయబాబు తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 17 కేసులకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.24 లక్షలు విలువ చేసే 160 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ కేసుల్లో కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన భూపతి అశోక్, లెప్రసీ కాలనీకి చెందిన కండవల్లి గణేష్, కోతాడ నాగశివసాయి కుమార్(సాయి)ను అరెస్ట్ చేశామన్నారు. వీరిపై కొవ్వూరు రూరల్, చాగల్లు, తాడేపల్లిగూడెం రూరల్, రాజమహేంద్రవరం త్రీటౌన్, తణుకు రూరల్, కడియం, అనపర్తి, మండపేట టౌన్, సమిశ్రగూడెం, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నిందితులను కొవ్వురు శివారు కొత్త హైవే రోడ్డులో అండర్ పాస్ వద్ద కొవ్వూరు రూరల్ ఎస్సై కె.శ్రీహరి అరెస్ట్ చేశారన్నారు.
ప్రమాదవశాత్తూ గోదావరిలో గల్లంతు
ఆత్రేయపురం: బొబ్బర్లంక గ్రామ పరిధిలోని పిచ్చుకలంక వద్ద గోదావరిలో శుక్రవారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరంలోని బాలాజీ పేటకు చెందిన రాజేష్ కుమారుడు వెలగలేటి సుజన్ తేజ (16) మరో ఇద్దరితో కలిసి సరదాగా పిచ్చుకలంక ప్రాంతానికి వచ్చాడు. ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో గోదావరిలో కాళ్లు కడుక్కుంటుండగా తేజ ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో మిగిలిన వారు నది ఒడ్డున ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. అతడి తల్లి వెలగలేటి శ్రీకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.రాము తెలిపారు.


